ముగ్గురు టెర్రరిస్టులను మట్టుపెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌లో సెక్యూరిటీ ఫోర్సెస్‌కు టెర్రరిస్టులకు మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగింది. సౌత్ కాశ్మీర్‌‌, పుల్వామా జిల్లా, ట్రాల్‌లోని చెవా ఉల్లార్‌‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టాయి. గురువారం సాయంత్రం మొదలైన ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. ముఖ్యంగా గురువారం రాత్రి టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయని తెలిసింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు మరణించగా, ఇద్దరు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అధికారులకు గాయాలయ్యాయని పోలీసులు వర్గాలు తెలిపాయి. చనిపోయిన టెర్రరిస్టులు స్థానిక ప్రాంతానికి చెందిన యువకులుగా అధికారులు కన్ఫమ్ చేశారు. ట్రాల్‌లో జమ్మూ కశ్మీర్ జాయింట్ టీమ్ పోలీసులు, ఆర్మీకి చెందిన 42 రాష్ట్రీయ రైఫిల్స్ అండ్ సీఆర్‌‌పీఎఫ్​ టీమ్స్ కార్డన్ సెర్చ్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. దీంతో టెర్రరిస్టులు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో అనుమానిత ప్రాంతానికి జాయింట్ టీమ్ ఫోర్సెస్ చేరుకుంది. భద్రతా దళాలు చేరుకోగానే టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దాంతో ఎన్‌కౌంటర్ మొదలైందని అఫీషియల్స్ చెప్పారు. ఈ నెలలో సౌత్ కశ్మీర్‌‌ రీజియన్‌లో జరిగిన 12వ ఎన్‌కౌంటర్ ఇది కావడం గమనార్హం. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురుకాల్పుల్లో మొత్తం 33 మంది టెర్రరిస్టులు మృతి చెందారు.

Latest Updates