వనస్థలిపురంలో 35 తులాల బంగారం చోరీ

సొంతూరుకు వెళ్లొచ్చే సరికి దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ సమీపంలోని వెలుగోములకు చెందిన విజయ భాస్కర్ రెడ్డి(42) బిజినెస్ మెన్. కొన్నేళ్లుగా వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లోని హరిహరపురం కాలనీలో నివసిస్తున్నారు. ఈ నెల7న కుటుంబసభ్యులతో కలిసి సొంతూరుకు వెళ్లారు. 8న రాత్రి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు ఓపెన్ చేసి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా సెంట్రల్ లాక్ సిస్టమ్ పగలగొట్టి ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోని 35 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి సామగ్రి పోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా, పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని రాచకొండ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా చోరీకి గురైన ఇంట్లో సీసీ కెమెరాలు ఉండగా శనివారం రాత్రి 10:15 గంటలకు విజయభాస్కర్ రెడ్డి సోదరి తన సెల్ ఫోన్ లో సీసీ ఫుటేజీని చూశానని, తిరిగి ఆదివారం చూస్తే ఫుటేజ్ రాలేదని తెలిపింది.

Latest Updates