3,500 సర్కారు స్కూళ్లు మూత! 

  • తక్కువ స్టూడెంట్లున్న స్కూళ్ల విలీనానికి సర్కారు నిర్ణయం
  • మౌఖిక ఆదేశాలు జారీ.. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తికి చర్యలు
  • 10 మందిలోపున్న ప్రైమరీ, 20లోపున్న యూపీఎస్‌‌,30లోపున్న హైస్కూళ్లపై ఎఫెక్ట్
  • బడులు మూయట్లేదు.. స్టూడెంట్ల అడ్జెస్ట్​మెంట్ ప్రతిపాదనలు తీసుకుంటున్నామన్న విద్యా శాఖ
  • వారికి ట్రాన్స్​పోర్ట్​ చార్జీలిస్తామని వెల్లడి
  • ఇది స్కూళ్లను మూసేసే యత్నమంటున్న టీచర్ యూనియన్లు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మూడున్నర వేల సర్కారు బడుల మూతకు రంగం సిద్ధమైంది. విద్యార్థులు తక్కువగా ఉన్న బడుల్లోని స్టూడెంట్లను దగ్గర్లోని బడుల్లో చేర్పించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో డీఈవోలు చర్యలు చేపట్టారు. తక్కువ మంది స్టూడెంట్లున్న స్కూళ్ల లెక్కలు తీయాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పది మంది లోపు స్టూడెంట్లున్న ప్రైమరీ స్కూళ్లు, 20 మందిలోపున్న యూపీఎస్​లు, 30 మందిలోపున్న హైస్కూళ్లలోని స్టూడెంట్లను సమీపంలోని సర్కారు బడుల్లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు టీచర్లు చెబుతున్నారు. ఆ స్కూళ్లలోని టీచర్లను అవసరమైన స్కూళ్లకు పంపనున్నారు.

మూడున్నర వేలకు పైగానే..

రాష్ట్రంలో మొత్తం 26,054 ప్రభుత్వ, లోకల్‌‌ బాడీ స్కూళ్లుండగా.. వాటిల్లో 21 లక్షల మంది వరకు స్టూడెంట్లు చదువుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని వందలాది స్కూళ్లలో స్టూడెంట్లు తక్కువగా ఉన్నారు. వాటిలో స్టూడెంట్లను చేర్పించే ప్రయత్నాలేవీ పెద్దగా జరగలేదు. పైగా ఏటా స్టూడెంట్స్‌‌ సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు గురుకులాల సంఖ్య పెరగడం కూడా ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలోనే తక్కువ మంది స్టూడెంట్లున్న స్కూళ్లను విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కిందే నిర్ణయించింది. జనం, టీచర్​ యూనియన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా ఈ అంశంపై ముందుకు వెళుతోంది.

రాష్ట్రంలో పది మందిలోపే స్టూడెంట్లున్న ప్రైమరీ స్కూళ్ల సంఖ్య 3 వేల వరకు ఉన్నట్టు అంచనా. 20 మందిలోపున్న అప్పర్‌‌ ప్రైమరీ, 30లోపు స్టూడెంట్లున్న హైస్కూళ్లు కలిపి 500 వరకు ఉన్నాయి. వీటన్నింటి నుంచి స్టూడెంట్లను సమీపంలోని బడులకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం బడిబాట కార్యక్రమంపై డీఈవోలు, ఎంఈవోలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌‌రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో డీఈవోలు ఎంఈవోలకూ ఆదేశాలిచ్చారు. మరోవైపు గతేడాది సుమారు 600 స్కూళ్లలో ఒక్క స్టూడెంట్​ కూడా చేరలేదు. వాటిల్లోని టీచర్లనూ డిప్యూటేషన్​పై వేరే బడులకు పంపారు. దాంతో అవి గతేడాదే తాత్కాలికంగా మూతపడగా.. ఈసారీ తెరిచే అవకాశం కనిపించడం లేదు.

టీచర్లు, స్టూడెంట్స్‌‌ పరిస్థితేంటి?

విలీనం చేయదలిచిన 3,500 బడుల్లో 30 వేల మంది వరకు స్టూడెంట్లు,10 వేల మంది వరకు టీచర్లు ఉంటారని అంచనా. వారిని ఎలా వేరే బడుల్లోకి మారుస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్‌‌కొక ప్రైమరీ, మూడు కిలోమీటర్లకు ఒక యూపీఎస్‌‌, ఐదు కిలోమీటర్లకొక హైస్కూల్‌‌ ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్లు తక్కువున్న స్కూళ్లను మూసేస్తే.. చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని టీచర్​ యూనియన్లు చెప్తున్నాయి.

టాన్స్‌‌పోర్ట్‌‌ చార్జీలిస్తం

బడులను మూసివేయాలని మేం చెప్పలేదు. తక్కువ స్టూడెంట్లున్న బడుల్లోని పిల్లలను మరో బడికి పంపించాలని పేరెంట్స్‌‌, ఎస్‌‌ఎంసీ కమిటీల నుంచి ప్రతిపాదనలు వస్తే వాటిని డీఈవోలు సేకరించి, మాకు పంపించాలని చెప్పాం . వాటిని పరిశీలించివిలీనం చేయాలా, లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటం. విలీనం చేస్తే ఆ స్టూడెంట్లకు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ చార్జీలు ఇప్పించే ప్రయత్నం చేస్తం.- విజయ్‌ కుమార్‌‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌

‌స్కూళ్లు మూసేసేందుకే..

తక్కువ మంది ఉన్న బడుల్లోని స్టూడెంట్స్‌‌ను,టీచర్లను రిలొకేషన్‌‌ చేయాలని చెప్పడమంటే స్కూళ్లను మూసేయడమే. విద్యార్థులను పెంచే చర్యలు తీసుకోవడం మాని, మూసేసేం దుకు నిర్ణయం తీసుకోవడమేంటి ? పిల్లలను చేర్పించే బడిబాట కార్యక్రమం కూడా పూర్తి కాక ముందే స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం సరికాదు. సర్కారు ఆదేశాల మేరకు జిల్లాల్లో డీఈవోలు ఎంఈవోలకు ఉత్తర్వులిస్తున్నారు. – రఘునందన్‌‌, టీటీఎఫ్‌‌ స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌

Latest Updates