370 మళ్లీ తెచ్చే దమ్ముందా? : మోడీ

అలా చేస్తే మీ పార్టీలు మటాష్.. కాంగ్రెస్, ఎన్సీపీకి  మోడీ వార్నింగ్
కాశ్మీర్​ కేవలం భూభాగం కాదు.. దేశానికి కిరీటమన్న ప్రధాని
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం

జల్​గావ్/ సకోలీ(మహారాష్ట్ర): దేశ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతుండటం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ కల్పించే ఆర్టికల్​ 370ని మళ్లీ అమల్లోకి తీసుకొస్తామంటూ కాంగ్రెస్​ ఎన్సీపీ లు పాకిస్తాన్​ భాషలో మాట్లాడుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్​ అంటే కేవలం భూభాగం మాత్రమే కాదని, దేశానికి కిరీటమని అన్నారు. కాంగ్రెస్​, ఎన్సీపీ నేతలకు నిజంగా దమ్ముంటే  ఆర్టికల్​ 370ని మళ్లీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని మోడీ సవాలు విసిరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జల్​గావ్, సకోలీ జిల్లా కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభల్లో మోడీ మాట్లాడారు. కాశ్మీర్​ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఇండియాకే సపోర్ట్​ చేస్తున్నాయని, ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే అసాధారణ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని, 40 ఏండ్ల కాశ్మీర్​ సమస్యను 4 వారాల్లో పరిష్కరించామని ప్రధాని తెలిపారు.

మచ్చలేని దేవేంద్రుణ్నే మళ్లీ గెలిపించండి

న్యూఇండియా నిర్మాణం మోడీ ఒక్కడితోనే సాధ్యం కాదని, ప్రజలు ఓట్లేసి ఆశీర్వదిస్తేనే ఆ కల నెరవేరుతుందని ప్రధాని అన్నారు.  మహారాష్ట్రలో ఐదేండ్లపాటు అవినీతిలేని పాలన అందించిన దేవేంద్ర ఫడ్నవీస్​నే మళ్లీ సీఎంగా ఎన్నుకోవాలని, బీజేపీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని మోడీ పిలుపునిచ్చారు. ‘‘మహారాష్ట్రలో 2014 ఎన్నికల ఫలితాలు ట్రైలర్​ మాత్రమే.  అసలు సినిమా ఈ నెల 24న వెల్లడయ్యే అసెంబ్లీ రిజల్ట్స్​ తర్వాత చూస్తారు”అని చెప్పారు.  ప్రపంచ దేశాలన్నీ రకరకాల సవాళ్లతో సతమతమవుతోంటే ఇండియా మాత్రం ధీమాగా ముందుకెళుతోందని, రూరల్​ డెవలప్​మెంట్​పై ఫోకస్​ పెంచడం వల్లే ఇది సాధ్యమైందని, ఆ సెక్టార్​లో 25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని  ప్రధాని చెప్పారు.

గత ప్రధానులకు  మోడీకున్న దమ్ములేదు: షా

జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ను రద్దు చేయడం ద్వారా ప్రధాని మోడీ దేశ ప్రజల కలని నిజం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన వాళ్లెవరికీ లేనంత దమ్ము, ధైర్యం ఉండబట్టే మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకోగలిగారని చెప్పారు. కొల్హాపూర్​లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, మహారాష్ట్రలో ఫడ్నవీస్​ సర్కారు అమలు చేసిన ‘జల్​యుక్తా శివార్​’ పథకం ద్వారా వేలాది ఎకరాలు సాగుభూమిగా మారిందని, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ కూటమినే మళ్లీ గెలిపించాలని షా అన్నారు.

Latest Updates