పుల్వామాలో ఎన్ కౌంటర్: అమరులైన నలుగురు జవాన్లు

కశ్మీర్: కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మళ్లీ ఉగ్ర ఘాతుకానికి మరో నలుగురు వీర జవాన్లు నేలకొరిగారు. పింగ్లాన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఇక్కడ ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగారు.

అర్థరాత్రి రెండు గంటల సమయం నుంచి కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. అనుమానిత ప్రాంతానికి చేరుకోగానే భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు నక్కిన ఇంట్లో నుంచే కాల్పులకు దిగారు. హోరాహోరీ కాల్పుల్లో ఒక మేజర్ సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. మరో జవానుకు గాయాలయ్యాయి. వీరంతా 55 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాన్లు. మృతులను మేజర్ వీఎస్ ధౌండియల్, హవల్దార్ రామ్, సిపాయి అజయ్ కుమార్, సిపాయి హరి సింగ్ గా గుర్తించారు.

ఆ ఇంట్లో నక్కి ఉన్న ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసిన జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారేనని తెలుస్తోంది.

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రదాడి మరిచిపోక ముందే వరుస అటాక్ లు జరుగుతున్నాయి. ఈ నెల 14 జరిగిన జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతి  దాడి పాల్పడడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో దేశ మంతా విషాదంలో మునిగిపోయింది. పాక్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో దేశమంతా ఉంది.

అది మరవక ముందే 16న కశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు పెట్టిన ఐఈడీ బాంబును డిఫ్యూజ్ చేస్తుండగా ఆర్మీ మేజర్ చిత్రేశ్ సింగ్ బిస్త్ ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ మళ్లీ పుల్వామాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో మరో నలుగురు అమరులయ్యారు. నాలుగు రోజుల్లోనే 45 మంది వీర జవాన్ల ప్రాణాలు కోల్పోవడంతో యావద్దేశం రగిలిపోతోంది. ముష్కర మూకల అంతు చూడాలని  ప్రతి ఒక్కరు కసితో ఉన్నారు.

Latest Updates