బాలుడిని రక్షించబోయి బావిలో పడిన మరో 30 మంది

బాలుడిని రక్షించబోయి బావిలో పడిన మరో 30 మంది

మధ్యప్రదేశ్‌లో ఊహించని ప్రమాదం జరిగింది. బావిలో పడిన బాలుడిని రక్షించే క్రమంలో మరో 30 మంది ప్రమాదవశాత్తు బావిలో పడిన ఘటన విదిశ జిల్లా గంజ్ బసోడా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. 19 మందిని స్థానికులు రక్షించారు. ప్రస్తుతం అక్కడ NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారికోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంత్రి విశ్వాస్ సారంగ్ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఈ గ్రామం విదిశ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ బాలుడు 50 ఫీట్ల లోతైన బావిలో పడిపోయాడన్న సమాచారంతో గ్రామస్తులంతా అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో బావిలో 20 ఫీట్ల మేర నీళ్లున్నాయి. అయితే కొంత మంది బాలుడిని రక్షించేందుకు బావిలోకి దిగారు. మరికొంత మంది వారికి సహాయం అందించేందుకు బావి గొడపై నిలుచున్నారు. అయితే చాలామంది గోడపై నిలబడటంతో.. బావి గోడ అకస్మాత్తుగా కూలడంతో వారందరూ బావిలో పడిపోయారు. బాధితులను రక్షించడానికి రాత్రి 11 గంటల సమయంలో తీసుకొచ్చిన ట్రాక్టర్ మరియు నలుగురు పోలీసులు కూడా బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, గాయపడిన వారికి 50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు.