సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని..

ఏపీ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగులకు నకిలీ అపాయింట్ మెంట్స్ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సిరివెళ్లకు చెందిన చాకలి మనోహర్ కు సచివాలయంలోని సోషల్ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు నమ్మబలికారు. ఉద్యోగం ఇప్పించేందుకు ఖర్చు అవుతుందని, అడ్వాన్స్ గా ముందే కొంత సొమ్ము ఇవ్వాలనడంతో నిరుద్యోగి అయిన మనోహర్.. వారి మాటలు నమ్మి రూ. 3,80,000 కు ఒప్పందం కుదుర్చుకుని రూ.30,000 అడ్వాన్స్ గా ఇచ్చాడు.  ఆ తర్వాత వారు మనోహర్ కు సోషల్ వెల్ఫేర్ విభాగం కార్యదర్శి రవిచంద్ర డిజిటల్ సంతకంతో ఓ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ నకిలీ అని తేలడంతో మనోహర్ తుళ్లూరు పోలీసులను ఆశ్రయించాడు. తనకు అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చిన వ్యక్తులు నంద్యాలకు చెందిన శివ నాగార్జునరెడ్డి,సంతోష్ కుమార్,రెడ్డి గౌతమ్,మిథున్ చక్రవర్తి గా పోలీసులకు  ఫిర్యాదు  చేశాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు  ఆ నలుగురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఈ ముఠా చేతిలో మనోహర్ కాక మరో ఆరుగురు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.

 

 

Latest Updates