నకిలీ వైద్యుడి నిర్వాకం.. పసికందు మృతి

జనగామ: తాను చిన్న పిల్లల డాక్టర్నని చెప్పుకుంటూ ఓ పసికందు మృతికి కారణమయ్యాడు ఓ నకిలీ వైద్యుడు. అనుమతలు లేకుండా తాను చేస్తున్న వైద్యానికి శ్రీ వెంకటేశ్వర అనే క్లినిక్ ఓపెన్ చేసి జనాల ప్రాణాలతో ఆడుకుంటూ.. చివరకు కటకటాల పాలయ్యాడు. పాలకుర్తి సీఐ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టేపాక వెంకన్న అనే వ్యక్తి పాలకుర్తిలో ఓ క్లినిక్ నడుపుతూ చిన్న పిల్లల వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. అతను నకిలీ డాక్టర్ అని తెలియక

బమ్మెర గ్రామానికి చెందిన ఒగ్గుల ఉపేంద్ర అనే వ్యక్తి తన నాలుగు నెలల కొడుకు కి జలుబు చేసిందని క్లినిక్ కి తీసుకువచ్చాడు. ఆ నకిలీ వైద్యుడి వైద్యం వికటించి ఆ పసి బాబు మరణించాడు. దీంతో బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ కేస్ నమోదు చేశారు.

దర్యాప్తు చేసే సమయంలో ఆ వైద్యుడి ఇలాంటి ఆరోపణలు మరెన్నో ఉన్నాయని తేలడంతో అతని పై విచారణ జరిపారు.  జనగామ  DMHO మహేందర్ అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా.. అతను అనుమతులు లేకుండా వైద్యం చేస్తూ, ప్రజలను  మోసం చేస్తున్నాడని తేలింది. దీంతో అతడిని జైలుకి పంపడం జరిగింది.

ఈ ఘటనపై సీఐ రమేష్ నాయక్ స్పందిస్తూ.. ఆర్.ఎమ్.పీ లు మరియు పీ.ఎమ్.పీ లు ఎవరైనా సరే ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, వచ్చి రానీ వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Latest Updates