గ్రేటర్‌లో 40 వేల విగ్రహాలు

30,593 మండపాలకు రిజిస్ట్రేషన్‌
మూడు కమిషనరేట్ల పరిధిలో జియో ట్యాగింగ్​
సీసీ కెమెరాల ఏర్పాటు

గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని 30,593 మండపాలకు పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగా, వాటికి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. మంగళవారం వరకు మొత్తం 12,600  మండపాలను జియో ట్యాగింగ్​  చేయగా నిమజ్జనం నాటికి పూర్తి చేయనున్నారు. ముందుగా మండపం లొకేషన్, నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు, స్థానిక లైజన్ ఆఫీసర్ పేర్లకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు యాప్ లో నమోదు చేసుకుంటారు. జియో ట్యాగింగ్ తో కనెక్ట్ అయిన  మండపాలను జీపీఎస్‌ సిస్టం ద్వారా నిత్యం పర్యవేక్షిస్తుంటారు. తద్వారా మండపాల వద్ద ఎలాంటి సెక్యూరిటీ సమస్య తలెత్తినా క్షణాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. 

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో  కొలువుదీరిన గణనాథుల విగ్రహాలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రతి మండపానికి క్యూ ఆర్ కోడ్ కూడా కేటాయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విధానంతో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా నిమిషాల్లోనే ఘటనాస్థలానికి వెళ్లేందుకు ప్లాన్‌ రెడీ చేశారు. హైదరాబాద్,రాచకొండ,సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో రిజిస్టరైన 30,593 మండపాలకు గానూ మంగళవారం వరకు మొత్తం12,600 గణపతి మండపాలను జియో ట్యాగ్ చేశారు.  నిమజ్జనం నాటికి ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపడతారు.

స్మార్ట్ యాప్స్ తో కనెక్ట్

జియో ట్యాగింగ్ తో కనెక్ట్ చేసిన మండపాలను గూగుల్ మ్యాప్ లో  పోలీసులు ఎప్పడికప్పుడు సమీక్షిస్తుంటారు. మండపం లొకేషన్, నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు, స్థానిక లైజన్ ఆఫీసర్ పేర్లకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్ లో ఉంటాయి. బ్లూకోల్ట్స్, ప్యాట్రో కార్ డేటా పోలీస్ యాప్స్ లో నిక్షిప్తం కావడంతో పటిష్టమైన నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయి.  గతేడాది ఈ విధానం సక్సెస్ కావడంతో ఈసారి కూడా మండపాలను  సీసీ కెమెరాలతో పాటు పోలీస్ యాప్స్, గూగుల్ యాప్ తో జియో ట్యాగ్ చేశారు.

డీసీపీ నుంచి సెక్టార్ఎస్ఐ దాకా

డీసీపీలు, ఏసీపీలతో పాటు ఒక్కో మండపాన్ని స్థానిక లైజన్ ఆఫీసర్,సెక్టార్ ఎస్‌ఐ స్థాయి అధికారులు నిరంతరం కో–ఆర్డినేట్ చేసుకుంటారు. ఐపీల సందర్శన, అనుమానితులు, ప్రాంతాల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ లో మొత్తం 30,593 గణపతి మండపాలు రిజిస్టర్ అయ్యాయి.

నిమజ్జనం ముగిసే వరకు అలర్ట్

నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల్లో నిమజ్జనానికి వెళ్లే మండపాల వివరాలను పోలీస్ యాప్స్ లో పొందుపరిచారు. పోలీసులు రిజిస్ట్రేషన్  చేసిన మండపాలే కాకుండా గ్రేటర్ లో మరో 9 వేలకు పైగా గణనాథులను నెలకొల్పినట్లు గుర్తించారు. జియో ట్యాగింగ్ వల్ల  ప్రతి మండపాన్ని గూగుల్‌మ్యాప్‌లో వీక్షించే అవకాశం ఉంది.

Latest Updates