ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌ నుంచి 43 లక్షలు గాయబ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఓ ఎన్ఆర్ఐ అకౌంట్​ నుంచి ఆయన ప్రమేయం లేకుండా ఫిక్స్​డ్​ డిపాజిట్​ నిధులు దారి మళ్లించడంపై ఐసీఐసీఐ బ్యాంకుకు స్టేట్​ అడ్జుడికేటింగ్​ ఆఫీసర్​ బెంచ్​ భారీ ఫైన్​ వేసింది. 2015లో సికింద్రాబాద్ ఎస్​డీ రోడ్ బ్రాంచ్ లో జరిగిన ఈ ఫ్రాడ్ కేసుకు సంబంధించి బాధితునికి రూ.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.50 వేలతోపాటు దారి మళ్లించిన రూ.43.07 లక్షల మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని సెప్టెంబర్ 30న ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడ్డ 60 రోజులలోపు అమౌంట్ సెటిల్ చేయాలని, లేని పక్షంలో పెనాల్టీ కింద 12 శాతం వడ్డీ చెల్లించాలని ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ సెటిల్​ చేయకపోవడంపై బాధితుని తరపు లాయర్​ పీవీ కృష్ణమాచారి సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

సమాచారం ఇవ్వకుండానే..

సికింద్రాబాద్ కు చెందిన రాజా ఉత్తమ్ కుమార్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో వర్క్ చేస్తున్నాడు. జీతంలో నుంచి కొంత మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేందుకు 2015లో సికింద్రాబాద్ ఎస్డీ రోడ్​ లోని ఐసీఐసీఐ బ్యాంక్ లో ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేశాడు. నెట్ బ్యాంకింగ్ ద్వారా 2015 డిసెంబర్ 7 నుంచి 21 వరకు రూ.50 లక్షలను తన అకౌంట్​కు బదిలీ చేశాడు. ఇందులో రూ.43.07 లక్షలను ఫిక్స్​డ్​ డిపాజిట్ చేశాడు. అయితే 2017 జనవరిలో రాజా ఉత్తమ్ కుమార్ ప్రమేయం లేకుండానే అతడి ఎఫ్​డీ మొత్తాన్ని బ్యాంక్ అధికారులు మరో వ్యక్తికి ట్రాన్స్ ఫర్ చేశారు. దీనికి సంబంధించి అతనికి ఓటీపీ కానీ, మెయిల్​కానీ రాలేదు.

సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు

ఆ తర్వాత మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు లాగిన్​అయ్యేందుకు ప్రయత్నించగా.. అందుకు నెట్ బ్యాంకింగ్ సపోర్ట్ చేయలేదు. లాగిన్​ సమస్యపై ఐసీఐసీఐ కస్టమర్ కేర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు రిజిస్టర్ చేసుకున్న కాల్ సెంటర్ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తన ఫిక్స్ డ్ డిపాజిట్స్ పై ఆరా తీయగా.. ఎఫ్​డీలోని రూ.43.07 లక్షలు వేరే వ్యక్తులకు ట్రాన్స్ ఫర్ అయినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ సిబ్బందిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు భాస్కరరాజు అనే బ్యాంక్​ ఉద్యోగిని అరెస్ట్ చేసి రూ.2 లక్షలు రికవరీ చేశారు. డబ్బులు కాజేసిన మరో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తును పెండింగ్ లో పెట్టారు.

నష్టపరిహారం కింద రూ.5 లక్షలు

ఈ ఇల్లీగల్ మనీ ట్రాన్స్ ఫర్ పై సాక్ష్యాధారాలతో స్టేట్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బెంచ్ లో రాజా ఉత్తమ్​ కుమార్ ఫిర్యాదు చేశాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓను బాధ్యులుగా చేర్చుతూ ఐటీ యాక్ట్ 2000/ఐటీఏఏ 200 కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన జయేశ్ రంజన్ బెంచ్ గతేడాది సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఆర్ఐ అకౌంట్​ నుంచి ట్రాన్స్ ఫర్ చేసిన రూ. 43.07లక్షలకు 9 శాతం వడ్డీ చెల్లించాలని, కస్టమర్ కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Latest Updates