చెప్పులతో కొట్టుకున్నరు.. ముక్కు నేలకు రాసిన్రు

వెలుగు నెట్వర్క్:

ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజూ నిరసనలు హోరెత్తాయి. రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున నుంచే  కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని చోట్ల దీక్షా శిబిరాల్లో కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. కార్మికులకు అఖిలపక్ష, విద్యార్థి నాయకులు మద్దతు తెలిపారు. సమ్మెకు సంఘీభావంగా ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు.

మహబూబ్​నగర్: ఆమరణ దీక్ష

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహిళా కండక్టర్లు ఓ ఇంట్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో కండక్టర్ నాగమణి ఇంట్లో 18 మంది కార్మికులు శనివారం ఉదయం దీక్షకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. తమ దీక్షను భగ్నం చేస్తే తాము అఘాయిత్యాలకు పాల్పడతామని కార్మికులు హెచ్చరించడంతో పోలీసులు లోపలికి వెళ్లేందుకు సాహసించలేదు. వారి దీక్షకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఎన్.పి.వెంకటేశ్, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఇంటి బయట బైఠాయించారు. జిల్లాలో అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేసేందుకు డీఎస్పీ శ్రీధర్ అంగీకరించటంతో రాత్రి 8 గంటలకు వారు దీక్ష విరమించారు.

నాగర్​కర్నూల్: కార్మికుల పల్లె బాట

వనపర్తి, నాగర్​కర్నూల్ జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగింది. నాగర్​కర్నూల్​జిల్లాలో ఆర్టీసీ కార్మికులు గ్రామాల్లో పర్యటించి ప్రజల మద్దతు కోరారు. అచ్చంపేటలో బస్సు డిపోలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘీభావం తెలిపిన బీజేపీ, కాంగ్రెస్ నేతలను అరెస్ట్​చేశారు. కొల్లాపూర్​లో కార్మికుల రిలే దీక్షలు కొనసాగాయి.

కరీంనగర్: మంత్రుల అడ్డగింత

కరీంనగర్​లో రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీపీఐ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. వారిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్, సీపీఎం నాయకులు బృందాలుగా విడిపోయి బస్టాండ్ ఇన్, అవుట్ గేట్ల వద్ద ఆందోళనకు దిగారు.

నారాయణపేట: దీక్ష చేస్తున్న కార్మికుల అరెస్టు

కల్వకుర్తిలో కార్మికులు మండల పరిషత్ మీటింగ్​ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ను నిలదీశారు. కార్మికుల గోడును సీఎం కు చెప్పలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు.

మెదక్: గొడవలు.. మహిళలకు గాయాలు

ఆర్టీసీ కార్మికులు, జేఏసీ, సీఐటీయూ నాయకులు మెదక్ బస్ డిపో గ్యారేజీని ముట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఒకరినొకరు పట్టుకొని బైఠాయించారు. పోలీసులు ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో పడేయటంతో పలువురు మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. రామచంద్రాపురంలో తోపులాటలో కండక్టర్లు భారతమ్మ, సువర్ణలకు గాయాలయ్యాయి. నారాయణఖేడ్, జహీరాబాద్​లో బస్సులు డిపో నుంచి బయటికి రాకుండా కార్మికులు ధర్నా చేపట్టారు. రామాయంపేటలో కార్మికులను ముందస్తుగా అరెస్ట్​చేశారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. సిద్దిపేటలో బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అరెస్ట్​చేశారు.

ఆదిలాబాద్: ఈడ్చుకెళ్లి..

ఆదిలాబాద్, ఆసిఫాబాద్​లలో కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో జేఏసీ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. తోపులాటలో ఆసిఫాబాద్​లో ఓ మహిళా కండక్టర్​స్పృహ తప్పి పడిపోయారు. ఆదిలాబాద్​లో ఓ కార్మికురాలి చేతికి గాయమైంది.

వరంగల్: బస్సుల అడ్డగింత

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారందరినీ అరెస్ట్​ చేశారు. ఏకశిల పార్క్ వద్ద కార్మికులు దీక్ష కొనసాగించారు. జనగామలో హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కార్మికులు, వారికి మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.

నిజామాబాద్: అన్నిచోట్ల అరెస్టులు

నిజామాబాద్‌, ఆర్మూర్‌‌, కామారెడ్డిలో నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. చర్చలకు పిలవాలని, సమస్యలు పరిష్కరించాలని బాన్సువాడలో కార్మికులు డిపో ఎదుట ఆందోళన చేశారు.

రంగారెడ్డి: బస్సు రోకో

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు బస్సు రోకో నిర్వహించారు. డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కకుండా అడ్డగించారు. ఇబ్రహీంపట్నం, తాండూరు, కూకట్​పల్లిలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన జేఏసీ నేతలను విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ల వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఘట్​కేసర్​లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బస్సుల్లేక స్టూడెంట్స్​ఇబ్బంది పడుతున్నారని, బస్సులు నడపాలని డీఎంలకు వినతిపత్రం అందించారు.

Latest Updates