శానిటైజ‌ర్ వ‌ల్ల ఓ వ్య‌క్తి చేతులకు మంట‌లు అంటుకుని…

క‌రోనా వైర‌స్ భ‌యంతో వాడుతున్న‌ హ్యాండ్ శానిటైజ‌ర్ వ‌ల్ల మంట‌లు అంటుకుని 44 ఏళ్ల వ్య‌క్తి ఆస్ప‌త్రి పాల‌య్యాడు. గ్యాస్ స్ట‌వ్ కు ద‌గ్గ‌ర‌గా కూర్చుని శానిటైజ‌ర్ చేతులు శుభ్రం చేసుకునే ప్ర‌య‌త్నంలో అత‌డికి మంట‌లు అంటుకుని తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ ఆదివారం నాడు హ‌ర్యానాలోని రేవ‌రీలో జ‌రిగింది.

రేవ‌రీ జిల్లాకు చెందిన 44 ఏళ్ల వ్య‌క్తి శ‌రీర‌మంతా కాలిన గాయాల‌తో నిన్న ఢిల్లీలోని స‌ర్ గంగా రామ్ హాస్పిట‌ల్ లో చేరాడు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం త‌ర‌చూ హ్యాండ్ శానిటైజ‌ర్ వాడాల‌న్న ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌తో చేతులు శుభ్రం చేసుకోబోయి.. అజాగ్ర‌త్త వ‌ల్ల‌ అత‌డు ప్ర‌మాదంలో ప‌డ్డాడు. గ్యాస్ స్ట‌వ్ ప‌క్క‌నే కూర్చుని చేతుల‌కు శానిటైజ‌ర్ రాసుకోబోయి దాన్ని దుస్తుల‌పై పోసుకున్నాడు. అయితే అందులో ఉండే ఆల్క‌హాల్ కు ఈజీగా అంటుకునే గుణం ఉండ‌డంతో గ్యాస్ ఫ్లేమ్ నుంచి దుస్తుల‌కు మంట‌లు వ్యాపించాయి. క్ష‌ణాల్లో ఒళ్లంతా అంటుకోవ‌డంతో కుటుంబ‌స‌భ్యులు మంట‌లు ఆర్పి.. అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

స‌ర్ గంగారామ్ హాస్పిట‌ల్ లోని ప్లాస్టిక్ అండ్ కాస్మ‌టిక్ స‌ర్జ‌రీ విభాగంలో బాధితుడికి డాక్ట‌ర్లు చికిత్స చేస్తున్నారు. అత‌డికి 35 శాతం కాలిన గాయాల‌య్యాయ‌ని, ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వారు చెప్పారు. త్వ‌ర‌గా కోలుకుని డిశ్చార్జ్ అవుతాడ‌ని తెలిపారు.

శానిటైజ‌ర్ల‌తో జాగ్ర‌త్త‌..

“ప్రస్తుతం మార్కెట్ లో దొరికే హ్యాండ్ శానిటైజర్లలో ఇథైల్ ఆల్కహాల్ 62 శాతం ఉంటుంది. దీనికి మండే స్వభావం చాలా ఎక్కువ. ఒకవేళ మంట దగ్గరకు వెళ్తే వెంటనే అంటుకుంటుంది. క‌రోనా వైర‌స్ బారి నుంచి ర‌క్షించుకోవ‌డానికి శానిటైజ‌ర్ వాడ‌డం మంచిదే. కానీ, దీన్ని వాడేట‌ప్పుడు కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలి. మంట‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నప్పుడు శానిటైజ‌ర్ చేతుల‌కు పూసుకోకూడ‌దు. అలాగే శానిటైజ‌ర్ ను అధిక మోతాదులో కూడా రాసుకోకూడ‌దు. దానితో చేతులు శుభ్రం చేసుకున్న త‌ర్వాత ఆరిపోయే వ‌ర‌కూ పొయ్యి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కూడ‌దు” అని చెప్పారు స‌ర్ గంగారామ్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ మ‌హేశ్ మంగ‌ళ్.

Latest Updates