బలిపీఠంపై బక్క రైతు..రాష్ట్రం ఏర్పాటైన నుంచి 4600 మంది సూసైడ్

  • గత 5 నెలల్లోనే 86 మంది రైతుల ఆత్మహత్య
  • రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి 4,600 మంది సూసైడ్​
  • దిగుబడి తగ్గడం, పెస్టిసైడ్స్‌, కూలీల ఖర్చు పెరగడంతో ఎఫెక్ట్
  • నాలుగైదు బోర్లు వేసినా నీళ్లు పడక లక్షల్లో అప్పులు
  • ఏం జేయాల్నో తెల్వని ఆవేదనలో బలవన్మరణాలు
  • కౌలు రైతులకు ‘గుర్తింపు’లేక బీమా కూడా రాని దుస్థితి
  • రైతు స్వరాజ్య వేదిక స్టడీలో వెల్లడి

హైదరాబాద్‌, వెలుగుపంట ఖర్చులు ఎక్కువాయె.. కనీస ధర రాదాయె.. నకిలీ విత్తనాలో దిక్కు, కనికరం లేని సర్కారు మరోదిక్కు, పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఇంకో దిక్కు అన్నదాతల ప్రాణాలు తీసుకుంటున్నయి. ఈ ఒక్క సారి కాదు.. ఈ ఒక్క ఏడాది కాదు.. ఏండ్లుగా రైతుల పరిస్థితి ఇంతే. ఏం చేయాల్నో తెల్వక, అప్పలెట్లా తీర్చాలె, ఇట్ల ఎట్లా గడవాల్నో అర్థంగాక ఉరిపోసుకుంటున్నరు, పొలంలనే పురుగుల మందు తాగుతున్నరు. ఒక్కరా.. ఇద్దరా.. తెలంగాణ ఏర్పాటైన ఈ ఆరేండ్లలో 4,600 మంది ప్రాణం తీసుకున్నట్టు రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌ఎస్‌వీ) నిర్వహించిన స్టడీలో తేలింది. ఇందులో గత ఐదు నెలల్లో రెండు రోజులకో రైతు లెక్కన 86 మంది ఆత్మహత్య చేసుకున్నరని వెల్లడైంది.పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా రూపొందించిన డిస్ట్రిక్ట్‌ క్రైం బ్యూరో రికార్డు (డీసీబీఆర్‌)ల ప్రకారమే ఈ లెక్కలు తేల్చామని ఆర్ఎస్వీ ప్రతినిధులు తెలిపారు. వాటితోపాటు గత ఐదు నెలల కాలంలో పత్రికల్లో రిపోర్టయిన రైతుల ఆత్మహత్య వార్తల ఆధారంగా సేకరించినవి ఉన్నాయన్నారు. లాక్ డౌన్ కాలంలో రిపోర్ట్‌ కాని ఆత్మహత్యలు మరిన్ని ఉండొచ్చని పేర్కొన్నారు.

నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ

కొత్త జిల్లాల వారీగా చూస్తే.. 2018 ఆగస్టు 15 వరకు (రైతు బీమా అమలుకు ముందు వరకు) నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 414 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 341 మంది ఆత్మహత్యతో సిద్దిపేట రెండో స్థానంలో నిలిచింది. వరంగల్​ రూరల్​(196), ఆదిలాబాద్​(173), జయశంకర్‌ భూపాలపల్లి (170), మెదక్​లో 166 మంది సూసైడ్​ చేసుకున్నారు. గత ఐదు నెలల్లో జరిగిన 86 ఆత్మహత్యల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్లు 23 మంది, నల్లగొండ జిల్లా వాళ్లు 16 మంది ఉన్నారు.

కౌలు రైతులకు అందని బీమా

వాస్తవంగా సాగుచేసే కౌలు రైతులకు రైతు బంధు, బ్యాంకు రుణం సహా సర్కారు నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. రైతుగా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో బీమా కూడా రావడం లేదు. భూమి ఉన్న రైతులకే రైతు బీమా వర్తిస్తోంది. రాష్ట్రంలో పట్టాదారు పాస్ బుక్కులున్న సుమారు 70 లక్షల మందిలో 20 లక్షల మంది వ్యవసాయానికి దూరంగా ఉన్నవారే. వాళ్ల భూములను కౌలుకు తీసుకుని సాగుచేసే రైతులు దాదాపు 20 లక్షల మందిదాకా ఉంటారని అంచనా. అయినా కౌలు రైతులుగా కేవలం 15 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులే ఉంటున్నారని, వాళ్లు రైతులని చెప్పేందుకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో బీమా వర్తించడం లేదని అధికారులే అంటున్నారు.

రైతు బీమాలో నమోదుచేస్తలేరు..

పట్టాదారు పాస్ బుక్కు ఉండి, 60 ఏండ్లలోపు వయసున్న రైతులకు రాష్ట్ర సర్కారు రైతు బీమా వర్తింపజేస్తోంది. ఈ బీమా ఉన్న రైతు ఏ కారణంతో చనిపోయినా రూ.6 లక్షలు అందుతున్నాయి. ఇందులో రైతు మరణానికి దారితీసిన పరిస్థితి (కాజ్ ఆఫ్ డెత్) కాలమ్ లో ‘అనుకోకుండా జరిగే సహజ మరణం, యాక్సిడెంట్, పాము కాటు, కరెంట్ షాక్’వంటి కారణాలను మాత్రమే నమోదు చేస్తున్నారు. రైతు బీమా అమలైనప్పటి నుంచి ఏడాదిన్నర టైంలో 26,698 మంది చనిపోగా.. 18,920 మంది సహజ మరణంగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. 1,313 మంది యాక్సిడెంట్లలో, 308 మంది కరెంట్ షాక్ తో , 120 మంది పాముకాటుతో చనిపోయారు. మిగతా 6,036 మంది ఇతర కారణాలతో మృతి చెందినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అంటే రైతుల ఆత్మహత్యలను విడిగా పేర్కొనకుండా.. ఇతరత్రా కారణాల్లో కలిపేసినట్టు స్పష్టమవుతోంది. అప్పులు, ఇబ్బందులతో బతకలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడితే.. ప్రత్యేక కాలమ్ గా పేర్కొనకపోవడం ఏమిటని రైతు స్వరాజ్య వేదిక నాయకుడు కొండల్ రెడ్డి ప్రశ్నించారు. బీమా సొమ్ము ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని, అసలు ఆత్మహత్యలు జరగకుండా సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

‘పత్తి’పాణం తీసింది

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొత్తగూడకు చెందిన మడావి అమృతరావు (58) తన రెండెకరాలకు తోడు మరో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఐదెకరాల్లో సాగుకు బోరు నీళ్లు ఉండగా, మిగతా సాగుకు వానలే ఆధారం. గత ఏడాది 13 ఎకరాల్లో పత్తి వేశాడు. దిగుబడి సరిగా రాక తీవ్రంగా నష్టపోయాడు. కౌలు పైసలు, పెట్టుబడుల కోసం తెచ్చినవి కలిపి మూడు లక్షలు అప్పు అయింది. ఆ ఆందోళనతోనే గత ఏడాది డిసెంబర్ 20న అమృతరావు పురుగుల మందు తాగాడు.

బోర్ల అప్పు ఎట్లా తీర్చాలని..

ఈ ఫొటోలో ఉన్నది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన రైతు ఈరమైన రాజు కుటుంబం. తండ్రి పేరిట ఉన్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసే రాజు.. 2018లో రెండు బోర్లు తవ్వించాడు. వీటికి లక్షన్నర వరకు ఖర్చుకాగా, అంతకు ముందు వేసిన బోర్ల కోసం తెచ్చిన మరో ఆరు లక్షల అప్పు ఉంది. ఇవన్నీ ఎలా తీర్చాలనే బెంగతో గత ఏడాది ఆగస్టు 19న ఉరేసుకున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, భార్య కవిత, కొడుకు రాకేష్, బిడ్డ కీర్తన ఆవేదనలో మునిగిపోయారు. భూమి నర్సయ్య పేరు మీదే ఉండడంతో రాజుకు ‘రైతు బీమా’వర్తించలేదు. సర్కారు సాయం అందలేదు. త్రిసభ్య కమిటీ ఈ కుటుంబాన్ని పరామర్శించి, 119 జీవో ప్రకారం రూ.6 లక్షలు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవట్లేదు.

ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎక్కువ మంది పత్తి, కౌలు రైతులే

ఆరేండ్లలో ఆత్మహత్య చేసుకున్న 4,600 మంది రైతుల్లో 81 శాతం (సుమారు 3,700 మంది) పత్తి, కౌలు రైతులే. సూసైడ్​ చేసుకున్న రైతుల్లో 700 మంది పరిస్థితిపై టిస్‌, రైతు స్వరాజ్య వేదిక​ స్టడీ చేసింది. సూసైడ్​ చేసుకున్న వారిలో 93 శాతం మంది చిన్న రైతులేనని.. ఇందులో 520 మంది కౌలు రైతులని గుర్తించింది. అట్లనే పత్తి రైతులు కూడా పెద్దసంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలు అప్పు చేసి పత్తి వేసినా.. పంట దెబ్బ తినడంతో ప్రాణాలు తీసుకున్నారని ఈ స్టడీలో పేర్కొన్నారు.

తెలంగాణలో 10 రోజుల్లో 82 కరోనా మరణాలు

Latest Updates