సిటిజన్‌షిప్ బిల్లు ఎఫెక్ట్: 48 గంటలు ఇంటర్నెట్ బంద్

పార్లమెంట్‌లో సిటిజన్‌షిప్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేఘాలయలో కూడా సిటిజన్‌షిప్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లమీదికి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడి అధికారులు మేఘాలయలో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఎస్ఎంఎస్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, మరియు యూట్యూబ్ ద్వారా తప్పుడు ప్రచారం జరిగి ప్రజల భద్రతకు ముప్పు రాకుండా ఉండటానికి మేఘాలయలో గురువారం సాయంత్రం 5 గంటల నుండి మొబైల్ ఇంటర్నెట్ మరియు మెసేజింగ్‌ను 48 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు మేఘాలయ హోం పోలీస్ శాఖ అదనపు కార్యదర్శి సివిడి డియాంగ్‌డో గురువారం తెలిపారు. అలాగే, తూర్పు ఖాసీ హిల్స్‌లో గురువారం రాత్రి 10 గంటల నుండి కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా.. పొరుగు రాష్ట్రమైన అస్సాంలో మొబైల్ ఇంటర్నెట్ బందును మరో 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందడంతో గౌహతి, దిబ్రూఘర్‌లలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిరవధిక కర్ఫ్యూ విధించారు.

Latest Updates