డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్

సినీ సెలబ్రిటీల విచారణతో అప్పట్లో సంచలనం

పూటకో సెలబ్రిటీని ప్రశ్నించిన సిట్ అధికారులు

సెలబ్రిటీల విచారణకు షెడ్యూల్ ను ప్రకటించి ఆసక్తిరేపిన సిట్

తాజా చార్జిషీట్ లో ఒక్క సెలబ్రిటీ పేరు కూడా చేర్చని సిట్

ప్రముఖులందరికీ సిట్ క్లీన్ చిట్

కొండను తవ్వి ఎలుకను పట్టారంటున్న పబ్లిక్

హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పెద్ద సంచలనం సృష్టించింది. ఐతే… ఈ కేసులో తాజా చార్జిషీట్ దాఖలుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అందులో ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఆ మధ్య కొన్ని వారాల పాటు కొనసాగిన డ్రగ్స్ కంట్రోల్ డిపార్టుమెంట్ అధికారుల దర్యాప్తు… ఈ కేసుపై చాలా ఆసక్తి , ఉత్కంఠ పెంచాయి. టాలీవుడ్ లో బిగ్ షాట్స్ అనదగ్గ బడా హీరోలు, నటులు, డైరెక్టర్లు , సినీ ప్రముఖులను ఒక్కొక్కరిని తమ ఆఫీస్ కు పిలిపించి ప్రశ్నించడం.. వారి నుంచి వాంగ్మూలాలు, ఆధారాలు సేకరించడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో కనపడింది. 

హైదరాబాద్ లోని ప్రముఖ పబ్ లు, సెలబ్రిటీలు పాల్గొనే పార్టీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయని పోలీసులకు, డ్రగ్ కంట్రోల్ డిపార్టుమెంట్ కు ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రభుత్వం ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటుచేసింది. పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, ముమైత్ , తరుణ్, నవదీప్, సుబ్బరాజు ఇలా.. చాలామంది ప్రముఖులను సిట్ టీమ్ విచారణ చేసింది. వీరితో పాటు.. డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్ సప్లయర్స్, డ్రగ్ డీలర్లను, పబ్ ల ఓనర్లను ప్రశ్నించింది. సుదీర్ఘంగా సాగిన దర్యాప్తు తర్వాత.. ఈ కేసులో తాజాగా నాలుగు చార్జిషీట్లను దాఖలు చేసింది సిట్.

ప్రత్యేక దర్యాప్తు బృందం డ్రగ్ కంట్రోల్ డిపార్టుమెంట్ కు దాఖలు చేసిన 4 చార్జిషీట్లలో ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. ఇందులో ఒక చార్జి షీట్ సౌతాఫ్రికా పౌరుడైన విక్టర్ పై ఉంది. అతను ముంబై నుండి హైదరాబాద్ కు కొకైన్ ని తరలించి అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఆగస్టు 2017లో అతనిని అరెస్టు చేశారు పోలీసులు. 

ఈ 4  చార్జిషీట్లలో మొత్తం 62 మంది పేర్లు నమోదై ఉన్నాయి. ఎక్కువమంది డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్ సప్లయర్స్, వారికి సహాయపడిన వారి పేర్లు ఉన్నాయి. 

హడావుడి కొండంత.. వాస్తవం ‘గోరంత’…!

సినీ సెలబ్రిటీల విచారణను షెడ్యూల్ తో సహా ప్రకటించి ఎంతో హడావుడి చేశారు సిట్ అధికారులు. రోజుకో సెలబ్రిటీ.. పూటకో డ్రగ్ డీలర్ ను విచారణ చేశారు. నోటీసులు… ఇంటరాగేషన్ లో గంటల పాటు ప్రశ్నలు…. రిపోర్టులు… ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు రివ్యూలు.. ఇదంతా చూసి.. రాష్ట్రంలో ఏదో జరుగుతోందని జనం అనుకున్నారు. ఇండస్ట్రీలో ఇంతగా డ్రగ్ మాఫియా వేళ్లూనుకుపోయిందా.. విస్తరించిందా అనుకున్నారు. సెలబ్రిటీల నుంచి అధికారులు శాంపిల్స్, వాంగ్మూలాలు తీసుకున్నారు. ఐతే.. ఇన్నాళ్ల తర్వాత ఇచ్చిన దాఖలైన చార్జిషీట్… పబ్లిక్ ను ఆలోచనలో పడేసింది.  

Latest Updates