కరోనా ఎఫెక్ట్ తో ఇటలీలో కోటిన్నర మంది బందీ

న్యూఢిల్లీకేరళలోని ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా వైరస్​ సోకింది. వాళ్లంతా పథనం తిట్టకు చెందిన వారేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. అందులో ముగ్గురు ఈమధ్యే ఇటలీకి వెళ్లి వచ్చినట్టు చెప్పారు. వెనిస్​ నుంచి దోహాకు ఖతార్​ ఎయిర్వేస్​కు చెందిన క్యూఆర్​ 126, దోహా నుంచి కొచ్చికి క్యూఆర్​ 514 విమానాల్లో వచ్చారన్నారు. ఎయిర్​పోర్టు అధికారులకు గానీ, దగ్గర్లోని హాస్పిటల్​లో గానీ వాళ్లు ఆ విషయం చెప్పలేదని తెలిపారు. జ్వరం వచ్చినా క్వారెంటైన్​కు వెళ్లలేదన్నారు. ఇప్పుడు అందరినీ హాస్పిటల్​కు తరలించి ఐసోలేషన్​ వార్డులో ట్రీట్​మెంట్​ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఐదుగురిని కలిసిన వారి కోసం జిల్లా హెల్త్​ అధికారులు వెతుకుతున్నారని తెలిపారు. ఈ ఐదు పాజిటివ్​ కేసులతో దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య 39కి పెరిగింది. ఇటలీ వాళ్లకు కొవిడ్​ పాజిటివ్​ రావడంతో వాళ్లు వచ్చిన బస్సును ఐటీబీపీ హెల్త్​ అధికారులు డిసిన్​ఫెక్టెంట్లతో క్లీన్​ చేయించారు.

గురుగ్రామ్​లో 420 మంది క్వారెంటైన్​

గురుగ్రామ్​కు చెందిన 420 మంది ఇళ్లలోనే సొంతంగా క్వారెంటైన్​లో ఉన్నారు. వాళ్లకు చైనా, మలేసియా, థాయ్​లాండ్​ దేశాలకు వెళ్లిన ట్రావెల్​ హిస్టరీ ఉండడంతో 28 రోజుల పాటు ఇళ్లలోనే క్వారెంటైన్​ కావాల్సిందిగా హెల్త్​ అధికారులు, వాళ్లకు సూచించారు. ఆ 420 మందికి కొవిడ్​ లక్షణాలైన జలుబు, దగ్గు వంటివి ఉన్నాయని అధికారులు చెప్పారు. అందరి బ్లడ్​ శాంపిళ్లను టెస్టుల కోసం పంపించినట్టు చెప్పారు. ఇక, గౌతమ్​ బుద్ధ నగర్​కు చెందిన 458 మంది 12 కొవిడ్​ బాధిత దేశాల నుంచి వచ్చారని, వాళ్లలో 424 మందిని ఇప్పటి దాకా ట్రాక్​ చేశామని చెప్పారు. 112 మంది శాంపిళ్లను టెస్టులకు పంపించగా, 54 రిపోర్టులు నెగెటివ్​ వచ్చాయని, మరో 68 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు.

ఎయిమ్స్​లో ఎమర్జెన్సీ వింగ్​

కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పేషెంట్ల కోసం ఢిల్లీ ఎయిమ్స్​లోని జయ ప్రకాష్​ నారాయణ్​ ఎపెక్స్​ ట్రామా సెంటర్​లో ఎమర్జెన్సీ వింగ్​ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 20 మందికి సరిపోయేలా అందులో ఐసోలేషన్​ బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అనుమానితులను అందులో ఉంచి టెస్టులు చేయాలని, పాజిటివ్​గా తేలితే వెంటనే ట్రీట్​మెంట్​ కోసం ఎన్​సీఐ జజ్జర్​కు పంపించాలని చెప్పింది. కొవిడ్​ పేషెంట్ల కోసం స్పెషల్​ గేట్​ను ఎయిమ్స్​లో ఏర్పాటు చేశారు. వాళ్ల ట్రావెల్​ హిస్టరీ, లక్షణాల తీవ్రత ఆధారంగా పేషెంట్లను రెడ్​, యెల్లో, గ్రీన్​ కేసులుగా విభజిస్తున్నారు. ఇటు పాండిచ్చేరిలోని జవహర్​లాల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పోస్ట్​ గ్రాడ్యుయేట్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ అండ్​ రీసెర్చ్​ (జిప్​మర్​)లో ఐసోలేషన్​ కోసం 13 బెడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. వారణాసిలోని ఓ ప్రైవేట్​ స్కూల్​, కరోనా రైమ్స్​తో పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. వైరస్​ లక్షణాలు, దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైమ్స్​ రూపంలో వివరిస్తోంది.

ఇటలీలో కోటిన్నర మంది బందీ

చైనా తర్వాత కొవిడ్​కు ఎక్కువ మంది బలైపోతున్నది ఇటలీలోనే. అక్కడ 233 మంది కొవిడ్​తో చనిపోయారు. 5,883 కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్క రోజే 1,200 కేసులు రిపోర్ట్​ అయ్యాయి. ఎక్కువగా లొంబార్డిలోనే కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఆ ప్రభావం మిలాన్​, వెనిస్​లపైనా పడింది. కేసులు కంట్రోల్​లోకి రాకపోవడంతో 1.6 కోట్ల మందిని ఆయా సిటీల్లోనే బందీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇటలీలోని నార్తర్న్​ ప్రావిన్స్​లను క్లోజ్​ చేయాలని, అందరినీ హోం క్వారెంటైన్​లో పెట్టాలని సర్కార్​ ఆదేశించింది. ఇకపై ఎవరూ ఎక్కడికి వెళ్లాలన్న తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఇప్పటికే స్కూళ్లు, జిమ్​లు, మ్యూజియంలు, నైట్​క్లబ్​ వంటి వాటిని మూసేయాల్సిందిగా ఇటలీ ప్రధాని గ్వైసెప్​ కాంటీ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్​లో ఒక్కరోజే 49 మంది చనిపోగా, మరణాల సంఖ్య 194కు పెరిగింది. 6,566 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. చైనాలో చనిపోయిన వారి సంఖ్య 3,098కి చేరింది. మొత్తం 80,703 కేసులు నమోదయ్యాయి. సౌత్​ కొరియాలో 7,313 కేసులు నమోదవగా, 50 మంది బలయ్యారు. అమెరికాలో కొవిడ్​కు బలైన వారి సంఖ్య 19కి పెరిగింది. మొత్తం 447 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్​లో 17, ఫ్రాన్స్​లో 16 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 1,07,828 పాజిటివ్​ కేసులు నమోదవగా, 3,662 మంది చనిపోయారు

Latest Updates