పోలీస్ వాహనం ఢీకొని బాలుడు మృతి

హైదరాబాద్: పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మంగళ్‌ హాట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సీతారాం బాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే అయిదేళ్ల బాలుడిని పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడిని హుటాహుటిన ఉస్మానియా హాస్పిటల్ కి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పెట్రోలింగ్‌ వాహనం డ్రైవర్ భగవాన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని సీఐ రంవీర్ రెడ్డి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.

Latest Updates