50 మంది అక్కాచెల్లెళ్లు : చదివేది ఒకే స్కూల్

పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే మైనార్టీ గురుకులాల్లో తమ కూతుళ్లను చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 30వేల మందికిపైగా మైనార్టీ బాలికలు.

ఈ గురుకులాల్లో ప్రత్యేకత చాటుకుంటున్నది కరీంనగర్ జిల్లా రేకుర్తి రాష్ట్ర అల్ప సంఖ్యాకుల (మైనార్టీ రెసిడెన్షియల్) గురుకుల బాలికల పాఠశాల. ఇక్కడ యాభై మందికి పైగా వివిధ కుటుంబాలకు చెందిన అక్కా చెల్లెళ్లు విద్యనభ్యసిస్తుండటం విశేషం. గురుకుల బాలికల పాఠశాలలో 302 మంది విద్యార్థినులుంటే.. వారిలో 50 మంది వివిధ కుటుంబాలకు చెందిన అక్కాచెల్లెళ్లే. ఒకరిని చేర్పించి, ఆమెకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ మిగిలిన పిల్లలనూ ఇదే స్కూల్లో చేర్పించారు. మరికొందరు తల్లిదండ్రులూ వారిబాటనే నడిచారు. రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతంగా నడుస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తున్నది ఈ గురుకులం.

మైనార్టీ బాలికల గురుకులాలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఒక్కో విద్యార్థినికి మూడు జతలు స్కూల్ యూనిఫారాలు, పాఠ్యపుస్తాకాలు, నోట్‌ పుస్తకాలు, ప్రతి మూడు నెలకొక కాస్మోటిక్ కిట్ ఉచితంగా ఇస్తున్నారు. వాటర్‌ ట్రీట్‌ మెంట్ ప్లాంట్ నిర్మించింది. బూస్టు కలిపిన పాలు, వివిధ రకాల అల్పాహారం, నెలకు 16 రోజులు గుడ్డు, నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్, వివిధ రకాల కూరగాయలు, సన్నబియ్యంతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడానికి లేబొరేటరీలో ప్రయోగాలు, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటుచేస్తున్నది. మొత్తంగా చూస్తే ఒక్కో విద్యార్థినిపై ప్రభుత్వం లక్ష రూపాయలకుపైగా ఖర్చుచేస్తున్నది.

Posted in Uncategorized

Latest Updates