50 శాతం దాటొద్దు : పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టు క్లారిటీ

పంచాయతీ ఎన్నికల విషయంలో   హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీనిపై సోమవారం(జూల-9) విచారణ జరిపిన హైకోర్టు..  SC, ST, OBCలందరికీ కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50శాతం దాటడానికి వీల్లేదని  రాష్ట్ర ప్రభుతిని సూచించింది.  అయితే గిరిజన ప్రాంతాల్లో ST రిజర్వేషన్లకు మాత్రం ఇది వర్తించదని, ఆ ప్రాంతాల్లో 50శాతం మించి ST రిజర్వేషన్లు కల్పించవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు  దాటకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది.

పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమేగాక సుప్రీంకోర్టు తీర్పునకు సైతం విరుద్ధమంటూ సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్‌ వి. సప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు నిబంధనలను సవాల్‌ చేస్తూ నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన ఎ. గోపాల్‌రెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

రిజర్వేషన్లు 50% దాటాయన్న పిటిషనర్లు
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని వివరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీలకు 100% రిజర్వేషన్లు ఇస్తున్నారని వివరించారు.

 

Posted in Uncategorized

Latest Updates