డిసెంబర్ చివరి నాటికి.. దేశంలో సగం మందికి కరోనా

  • పేషెంట్లలో 90% మందికి సింప్టమ్స్ కనిపించవు
  • 5–10% మందికే ఆక్సిజన్ అవసరం
  • 5% మందికే వెంటిలేటర్లు కావాలె
  • జూన్ నుంచి వైరస్ విజృంభిస్తది
  • కరోనాపై పోరుకు రాష్ట్రాలన్నీ రెడీ కావాలె
  • బెంగళూరులోని ‘నిమ్ హాన్స్’ న్యూరోవైరాలజీ చీఫ్ డాక్టర్ రవి హెచ్చరిక

బెంగళూరు: కరోనా మహమ్మారి డిసెంబర్ చివరి నాటికి దేశంలో సగం మందికి అంటుకునే చాన్స్ ఉందట. వీరిలో 90 శాతం మందికి అసలు వైరస్ సోకిన విషయమే తెలియకపోవచ్చట. కేవలం 5 శాతం మందికి మాత్రమే ఈ వైరస్ వల్ల ప్రాణాల మీదకొస్తుందట. ఈ నెల 31న లాక్ డౌన్ 4.0 ముగిసిన తర్వాత జూన్ నుంచి కేసులు ఒక్కసారిగా పెరుగుతాయని, కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కూడా జరిగే చాన్స్ ఉందని ఈ మేరకు బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్ హాన్స్)లోని న్యూరోవైరాలజీ హెడ్, కర్నాటక కొవిడ్–19 టాస్క్ ఫోర్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వి. రవి వెల్లడించారు. రాబోయే నెలల్లో కరోనా తీవ్రంగా వ్యాపించి, 50% మందికి సోకనున్నప్పటికీ, వీరిలో 90 శాతం మందికి దీనివల్ల పెద్దగా సమస్యలేమీ ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. 5 నుంచి 10 శాతం మంది పేషెంట్లకు మాత్రమే హై ఫ్లో ఆక్సిజన్ అవసరం ఉంటుందని, మరో 5 శాతం మందికి మంది మాత్రమే వెంటిలేటర్లు పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు.

ఎబోలా, సార్స్ కన్నా డేంజరేమీ కాదు..

కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి నాటికి వచ్చే అవకాశం ఉందని, అప్పటివరకూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవించడమే ప్రజల్లో చేతుల్లో ఉందని డాక్టర్ రవి అన్నారు. కరోనా.. ఎబోలా, సార్స్, మెర్స్ వైరస్ లకన్నా ఎక్కువ డేంజరేమీ కాదన్నారు. మనదేశంలో కరోనా మరణాల రేటు 3 నుంచి 4 శాతం మధ్యలో ఉందన్నారు. గుజరాత్ లో మాత్రం అత్యధికంగా 6 శాతం వరకూ డెత్ రేట్ ఉందని పేర్కొన్నారు.

ప్రతి జిల్లాలో 2 ల్యాబ్ లు ఉండాలె..

వచ్చే నెల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరగనున్నందున వైరస్ ను హ్యాండిల్ చేసేందుకు రాష్ట్రాలన్నీ పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని డాక్టర్ రవి సూచించారు. పెద్ద సంఖ్యలో వచ్చే కేసులను హ్యాండిల్ చేసేందుకు తగినంతగా మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చుకోవాలన్నారు. ముఖ్యంగా కరోనా పేషెంట్ల కోసం స్పెషల్​ ఐసీయూలు, ట్రీట్ మెంట్ సెంటర్లను రెడీ చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో కేసులు పెరగనున్నందున, ప్రతి జిల్లాలో కనీసం రెండు కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసుకోవాలని ఐసీఎంఆర్ కూడా రాష్ట్రాలకు సూచనలు జారీ చేసిందని తెలిపారు.

కరోనా పర్మినెంట్ గా ఉంటది

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, కరోనా వైరస్ ఏళ్లపాటు వ్యాప్తిలో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్ఐవీ, మీజిల్స్, చికెన్ పాక్స్ మాదిరిగా ఈ వైరస్ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ పర్మినెంట్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ‘‘ఈ వైరస్ ఇక్కడే ఉండిపోతుంది. మనం దానితో కలిసి ఎంత సేఫ్ గా బతుకుతామన్నదే ఇప్పుడున్న ప్రశ్న” అని యూనివర్సిటీ ఆఫ్​షికాగో ఎపిడెమియాలజిస్ట్ సారా కోబే అన్నారు. యూనివర్సిటీ ఆఫ్​కాలిఫోర్నియా ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ నోమర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

50 per cent of Indian population could be COVID-19 infected by December: NIMHANS Neurovirology head

Latest Updates