50% VVPAT స్లిప్ ల లెక్కింపు కుదరదు: ఈసీ

ఎన్నికల్లో VVPAT కౌంట్ పెంచాల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్. EVMలతో 50శాతం VVPAT స్లిప్పులను లెక్కపెట్టడం కుదరదని స్పష్టం చేసింది. 21 పార్టీలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఈసీ.. 50 పేజీల అఫిడవిట్ సమర్పించింది. ఏశాట్ ప్రయోగంపై ప్రధాని మోడీ చేసిన ప్రకటన కోడ్  ఉల్లంఘన కాదని సీఈసీకి క్లారిటీ ఇచ్చింది.

ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా వీవీప్యాట్ లను లెక్కిస్తే లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రకటన 6 రోజులు ఆలస్యమవుతుందని భారత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. 50శాతం VVPAT స్లిప్పులు లెక్కపెట్టాలని 21 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది ఎలక్షన్ కమిషన్. 50 పేజీల అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.  ప్రతి పార్లమెంటరీ లేదా శాసనసభ నియోజకవర్గంలోనూ సగటున 50 శాతం వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలంటే ఓట్ల లెక్కింపుకు 6 రోజుల సమయం పడుతుందని తెలిపింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ నివేదిక ప్రకారం ఈవీఎం-వీవీప్యాట్ కచ్చితత్వ స్థాయి 99.9936 శాతంగా ఉందని తెలిపింది. వీవీప్యాట్ల కౌంట్ పెంచాల్సిన అవసరం లేదని కోర్టుకు వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఎన్నికల సంఘం ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గంలో కేవలం ఒక పోలింగ్ స్టేషన్ లో మాత్రమే వీవీప్యాట్ స్లిప్ లను తనిఖీ చేయడానికి అవకాశం ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ 21 ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని సీఈసీని ఆదేశించింది. దీంతో పూర్తి వివరాలతో అఫడవిట్ సమర్పించింది ఎన్నికల సంఘం.

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో 10.35 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్ లలో 479 ఈవీఎంలు, వాటికి అనుసంధానం చేసిన వీవీప్యాట్లను తనిఖీ చేయాలని సిఫారసు చేసింది. దీనివల్ల నమ్మకం స్థాయి 99.9936 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అయినప్పటికీ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో 4,125 ఈవీఎంలు, వీవీప్యాట్లను తనిఖీ చేస్తామని, ఇది ఐఎస్ఐ సిఫారసు చేసిన సంఖ్య కన్నా ఇది 8.6 రెట్లు ఎక్కువ అని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ చెప్పారు.

ఏశాట్ ప్రయోగంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగానికి సీఈసీ క్లీన్  చిట్  ఇచ్చింది. మోడీ ప్రసంగం నిబంధనలకు లోబడే ఉందని ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు తాము ఎక్కడా గుర్తించలేదని తెలిపింది.

మరోవైపు  విపక్షాల అభ్యంతరాలతో  రైళ్లలో టీ, కాఫీ సర్వ్ చేస్తున్న మై బీ చౌకీదార్ అని ప్రింట్ చేసిన కప్పులను, మోడీ ఫొటోలతో ఉన్న టికెట్లను రైల్వే శాఖ ఉపసంహరించుకుంది. వీటిని ఉపయోగించిన  కాంట్రాక్టర్ కు ఫైన్ వేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.

 

 

Latest Updates