బాటిల్‌‌ చెప్పిన భలే స్టోరీ

అమెరికాలోని అలస్కా. వండుకోవడానికి కట్టెల కోసం ఒకాయన వెతుకుతున్నాడు. ఇంతలో ఓ బాటిల్‌‌ కనబడింది. భలే ఉందని తీసుకున్నాడు. చూస్తే లోపలో పేపర్‌‌ ఉంది. 50 ఏళ్ల కిందట ఓ రష్యా నావికుడు రాసిన లెటరది. కట్టెల కోసం వెతికిన వ్యక్తి పేరు టేలర్ ఇవనాఫ్‌‌. షిష్‌‌మరెఫ్‌‌ ద్వీపంలో ఉన్న తన ఇంటికి పశ్చిమం వైపు 32 కిలోమీటర్ల దూరంలో ఆ బాటిల్‌‌ దొరికిందని చెప్పారు. మూత తెరవడానికి చాలా ట్రై చేశానని, చివరికి పంటితో కొరకాల్సి వచ్చిందన్నారు. బాటిల్‌‌ లోపల ఇంకా పొడిగానే ఉందని, వైన్‌‌ వాసన వస్తోందని చెప్పారు. కాగితం కూడా పొడిగానే ఉందన్నారు. ఆ లెటర్‌‌ రష్యా భాషలో ఉండటంతో టేలర్‌‌కు ఏం అర్థం కాలేదు. దాన్ని ఫొటో తీసి ఫేస్‌‌బుక్‌‌లో పోస్టు చేశారు. ట్రాన్స్‌‌లేట్‌‌ చేయమని నెటిజన్లను అడిగారు. ఇంతకీ ఆ లెటర్‌‌లో ఏముందంటే.. ‘బాటిల్‌‌ దొరికిన వారికి రష్యా ఫార్‌‌ ఈస్ట్‌‌ ఫ్లీట్‌‌ మదర్‌‌ షిప్‌‌ వీఆర్‌‌ఎక్స్‌‌ఎఫ్‌‌ శూలక్‌‌ తరఫున హాయ్‌‌. ఈ బాటిల్​ దొరికినోళ్లు వ్లాదివోస్టోక్‌‌ 43 బీఆర్‌‌ఎక్స్‌‌ఎఫ్‌‌ శూలక్‌‌ అడ్రస్‌‌కు రెస్పాండ్‌‌ అవండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ సెయిలింగ్‌‌. 1969 జూన్‌‌ 2’ అని రాసి ఉంది.

నా బాటిల్‌‌ ఎటు పోతుందో..!

ఆ లెటర్‌‌ ఆ నోటా ఈ నోటా చేరి చివరికి రష్యా మీడియాకు చిక్కింది. వాళ్లు ఆ లెటర్‌‌ రాసిన కెప్టెన్‌‌ అనటోలి బోట్సనెన్కోను కనుగొన్నారు. ఆయనకు ఇప్పుడు 86 ఏళ్లు. లెటర్‌‌ గురించి చెప్పగానే ఆయన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అది తానే రాశానన్నారు. 1966 వరకు శూలక్‌‌ షిప్‌‌ నిర్మాణంలో పాలుపంచుకున్న అనటోలి.. 1970 వరకు అందులో పని చేశారు. ఓ చిన్న ఫొటో ఓ పెద్ద స్టోరీ అవుతుందని తాను అనుకోలేదని బాటిల్‌‌ దొరికిన టేలర్‌‌ అన్నారు. తాను కూడా ఒకరోజు ఓ బాటిల్‌‌లో లెటర్‌‌ రాసి సముద్రంలో వేస్తానని చెప్పారు. ‘ఆ బాటిల్‌‌ ఎక్కడికి పోతుందో చూద్దాం’  అన్నారు నవ్వుతూ!

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates