500 నుండి 1100కి చేరిన అడ్మిషన్లు : ఆదర్శంగా నిలిచిన సర్కార్ బడి

NZBGOVTSCHOOL-PKGడిజిటల్  క్లాస్ రూములు,  అనుభవమున్న  టీచర్లు, మధ్యాహ్న  భోజనంతో  సహా… అన్ని  సౌకర్యాలున్న ఈ సర్కారు  బడిలో  చదువుకునేందుకు  పోటీ పడుతున్నారు విద్యార్థులు.  ప్రైవేట్ పాఠశాలల్లో  చదువుకున్న   వారిని  కూడా …ఇక్కడ  చేర్చేందుకు ఇష్టపడుతున్నారు  పేరెంట్స్. కార్పోరేట్  సంస్థలు  ప్రచారం  చేసుకుంటున్నా… అన్ని హంగులు  ఇక్కడ  ఉండడంవల్లే  …బోర్గాం  సర్కారు  బడి ఆదర్శంగా  నిలిచింది.

కార్పోరేటు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో తమ పిల్లలను చదివించడం ఫ్యాషన్ గా భావిస్తున్న సమయంలో ఈ సర్కారు బడి అందరినీ ఆకర్శిస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది బోర్గాం పి ప్రభుత్వ పాఠశాల. 2014 లో 510 మంది విద్యార్థులుండగా.. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 1102 కు చేరుకుంది. టీచర్లు, ఎస్ ఎం సి, గ్రామస్తుల కృషితో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. బోర్గాంపి స్కూలుకు మొదటినుంచి మంచి పేరే ఉంది. నిజామాబాద్ నగరం నుంచి కూడా ఇక్కడకొచ్చి చదువుకునేవారు. గ్రామస్తులు, టీచర్లు, స్కూలు కమిటీ సమిష్టి కృషితో ఈ పాఠశాలలో ప్రైవేట్ స్కూళ్లతో సమానంగా సౌకర్యాలు సమకూరాయి. స్కూలులో నాలుగు అదనపు తరగతి గదులు కట్టేందుకు  41 లక్షలు మంజూరు కాగా.. ఆ పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా.. మేనేజిమెంట్ కమిటి స్వయంగా చేపట్టింది. ఇలా మిగిలిన డబ్బుతో మరో రెండు గదులను కట్టుకోవడమేకాక.. 1.07 లక్షలతో డిజిటల్ క్లాసుల కోసం ఓ ప్రోజెక్టర్ కొన్నారు.

ఈ స్కూళ్లో ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువ మంది చదువుకుంటున్నారు. మొత్తం 1102 మంది విద్యార్థుల్లో 825 మంది ఇంగ్లిష్ మీడియంలో ఉంటే.. తెలుగు మీడియంలో కేవలం277 మంది విద్యార్థులే ఉన్నారు. 6 నుంచి పదో తరగతి వరకు ఉన్న ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 24 మంది రెగ్యులర్ టీచర్లున్నారు.  సర్వశిక్ష అభియాన్ కింద ఇద్దరు, గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా ఇద్దరు విద్యా వాలంటీర్లు పని చేస్తున్నారు. దాతల సహకారంతో క్రీడా దుస్తులు, క్రీడా సామాగ్రి అందిస్తుంది కమిటీ. ఇక్కడ చదువుకుంటున్నవారు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈసారి పదోతరగతిలో ఒక విద్యార్ది 10 జీపిఏ, మరో ఇద్దరు 9.7 జిపిఏ సాధించారు. 90 శాతం మంది పిల్లలకు 9 జిపిఏ వచ్చింది. ముగ్గురికి బాసర త్రిపుల్ ఐటిలో సీట్లు వచ్చాయి. ఇక్కడ చదువుకున్న వారు మంచి ఫలితాలు సాధించడంతో అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు. దీంతొ ఈ పాఠశాలలో అడ్మిషన్లు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వోద్యోగులు కూడా తమ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు.

ఇక్కడ చదువుతో పాటు ఆటపాటలు కూడా నేర్పుతున్నారు. పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ స్కూలు విద్యార్థి  జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు కూడా ఎంపికయ్యాడు. స్కూలులో అప్పటి జిల్లా కలెక్టర్ యోగితా రాణా సహకారంతో లైబ్రరీని ఏర్పాటు చేశారు. జనరల్ నాలెడ్జితో పాటు వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు ఇక్కడ ఉంచారు. రోజూ న్యూస్ పేపర్లను చదవడం కూడా అలవాటు చేస్తున్నారు. పాఠశాలలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ యూనిట్ ను ప్రారంభించారు. నేరాలను అడ్డుకునేలా అవగాహన కల్పించటం, చిన్న వయస్సులోనే ధైర్యంగా ఉండేలా తీర్చిదిద్దడం కోసం నిజామాబాద్ కమీషనర్ కార్తీకేయ…  22 మంది బాలికలు, 22 మంది బాలురతో ఈ యూనిట్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పోలీసు శాఖ యూనిఫాం సమకూర్చి.. శిక్షణ ఇస్తుంది.

అందరు విద్యార్థులకు మద్యాహ్న బోజన పథకం అమలవుతుంది. రుచికరమైన,నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తమ పిల్లలు ఎలా చదువుకోవాలని భావిస్తారో అలాంటి విద్యను అందించడంవల్ల బోర్గాం స్కూలు ఈ స్థాయిలో ఉందని చెప్తున్నారు హెడ్ మాస్టర్ రామారావు. ప్రతి వద్యార్థి మీద టీచర్లు శ్రధ్ద పెడున్నారని.. వారి స్థాయి తగ్గట్టు బోధన చేస్తున్నారని చెప్పారు. అందరు కలిసి కృషి చేస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా అద్భుతాలు సాధిస్తాయనడానికి బోర్గాం ఒక ఉదాహారణ… ఇలాంటి పాఠశాలకి  ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates