ప్రాణం పోయినా వదల్లేక.. ఇంట్లోనే శవంతో..

భర్త ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేని ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఖననం చేయకుండా ఇంట్లోనే దాచి ఉంచింది. కన్నకూతురికి కూడా తండ్రి చనిపోయాడనే విషయం చెప్పకుండా బతికే ఉన్నట్టుగా రెండు రోజులపాటు నమ్మించింది

సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతానికి చెందిన జై కుమార్(59) ఇండియన్ రైల్వేలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. అతని భార్య మీనా(55) రైల్వే స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. వారికి తొమ్మిదేళ్ల కూతురు. హార్ట్ ప్రాబ్లెంతో బాధపడుతున్న జై కుమార్  సోమవారం ఉదయం మరణించినట్టు తెలుస్తోంది. భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకున్న మీనా..  తన కూతురికి కూడా ఆ నిజం తెలియనివ్వకుండా.. తన తండ్రి బెడ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పింది.

అయితే రెండు రోజులుగా తన తండ్రి బెడ్ రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కూతురు.. బుధవారం అతని దగ్గరకు వెళ్లి చూసింది. ఉలుకుపలుకు లేకపోవడంతో అతన్ని కదపగా నోటి నుంచి రక్తం రావడంతో భయపడి తన అంకుల్ కి కాల్ చేసి చెప్పింది. పాప ద్వారా విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కుమార్ నివాసానికి చేరుకొని..  మృతదేహాన్ని పరిశీలించడానికి ప్రయత్నించగా మీనా వారిని అడ్డుకుంది. పోలీసులు ఆమెకు నచ్చజెప్పి.. శవాన్ని పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. గుండె పోటు కారణంగా రెండు రోజుల క్రితమే చనిపోయాడని అక్కడి డాక్టర్లు చెప్పారు.

అతని మరణించాడని తెలిసి కూడా భర్త మృతదేహాన్ని  రెండు రోజులుగా బెడ్ రూమ్ లో ఉంచి అదే గదిలో, అదే మంచం మీద ఆమె రాత్రుళ్లు నిద్రించిందని పోలీసులు చెప్పారు. ఆ ఇంట్లో పనిచేసే పనిమనుషులకు కూడా అతను చనిపోయిన విషయం తెలియదన్నారు. ఆమె మానసిక పరిస్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates