డాక్టర్ రెడ్డీస్‌‌కు ₹570 కోట్ల నష్టం

24.5 శాతం పెరిగిన ఆపరేటింగ్‌‌ మార్జిన్లు

ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లాబొరేటరీస్‌‌ గత ఏడాది డిసెంబరు 31తో ముగిసిన మూడో క్వార్టర్‌‌కు కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన రూ.569.70 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించింది. తాజా క్వార్టర్‌‌లో ఈ కంపెనీకి రూ.490 కోట్ల నష్టం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలను ఇది మించడం గమనార్హం. అయితే ఏడాది క్రితం డిసెంబరు క్వార్టర్‌‌లో ఇది రూ.485.20 కోట్ల లాభం సంపాదించింది. ఇదేకాలంలో రెవెన్యూలు మాత్రం 14 శాతం పెరిగి రూ.4,383 కోట్లుగా రికార్డయ్యాయి. ఇండియా, అమెరికా, యూరప్​తోపాటు వర్ధమాన దేశాల మార్కెట్లలో అమ్మకాలు బాగుండటంతో ఆదాయం పెరిగింది. సీక్వెన్షియల్‌‌గా చూస్తే మాత్రం రెవెన్యూలు తొమ్మిది శాతం తగ్గాయి.  గత ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్‌‌లో కంపెనీ రూ.3,850 కోట్ల విలువైన అమ్మకాలు సాధించింది. కంపెనీ గ్రాస్‌‌ ప్రాఫిట్‌‌ మార్జిన్‌‌ ఈ క్వార్టర్‌‌లో 54.10 శాతం కాగా, సెప్టెంబరు క్వార్టర్‌‌లో ఇది 57.5 శాతం ఉంది. గత క్యూ3లో 53.9 శాతం రికార్డయింది. జీనువారింగ్‌‌ సహా కొన్ని ప్రొడక్టుల కోసం ఇంపేర్‌‌మెంట్‌‌ చార్జీల (కోర్టు, ఇతర ఖర్చులు) వల్ల లాభాలపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీ కో–చైర్మన్‌‌ జీవీ ప్రసాద్‌‌ చెప్పారు. క్వాలిటీ సిస్టమ్స్‌‌ను మరింత మెరుగుపరిచామని ప్రకటించారు. ఇదే క్వార్టర్‌‌లో నువారింగ్‌‌కు జెనెరిక్‌‌ వెర్షన్‌‌ సహా ఐదు కొత్త డ్రగ్స్‌‌ విడుదల చేశామని తెలిపారు.

కొన్ని ముఖ్యాంశాలు

అమెరికా మార్కెట్లో విస్తరణకు డాక్టర్ రెడ్డీస్‌‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యూఎస్​ఎఫ్‌‌డీయేకి 101  జనరిక్‌‌ ఫైలింగ్స్‌‌ను అందజేసింది.

ఇండియా నుంచి వచ్చిన రెవెన్యూలు గత క్యూ3తో పోలిస్తే ఈ క్యూ3లో 13 శాతం పెరిగింది.

రష్యా సహా అంతర్జాతీయ మార్కెట్లలో డ్రగ్స్‌‌కు డిమాండ్‌‌ పెరిగింది. ఎమర్జింగ్‌‌ మార్కెట్లలో సేల్స్‌‌ ఈ ఏడాది 12 శాతం పెరిగాయి.

సీఐఎస్‌‌, రొమేనియా మార్కెట్ల నుంచి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. మిగతా మార్కెట్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని రూ.2,500 కోట్లుగా లెక్కగట్టారు.

ఫలితాల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్‌‌ షేరు సోమవారం రూ.168 లాభపడి రూ.3,200లకు చేరింది.