571 జాతుల చెట్లు మాయం

ఆ చెట్టు పేరు  గ్రాండీడీర్​బావోబాబ్. మడగాస్కర్​లో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. వందల ఏండ్లు బతికే అత్యంత అరుదైన ఈ చెట్లు ఇప్పుడు కేవలం5 మాత్రమే మిగిలాయట! మడగాస్కర్​లో ఉన్న ఇలాంటివే మరో 9 జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయట. ఇవే కాదు.. గత కొన్నేండ్లలో భూమి మీద చెట్లు అంతరించిపోవడం వందల రెట్లు పెరిగిందని చెబుతున్నారు సైంటిస్టులు. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం, గత కొన్నేండ్లలోనే 571 జాతుల మొక్కలు కనుమరుగైపోయాయని అంటున్నారు. మొక్కలు, జంతువులు కలిసి సుమారుగా10 లక్షల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు. భూమిపై జీవ జాతులు అంతరించిపోవడం ఇప్పుడు చాలా వేగంగా జరుగుతోందని, ఓ రకంగా ఇది జంతు, చెట్ల జాతుల అంతానికి దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

ముప్పు 350 రెట్లు పెరిగింది

అడవుల నరికివేత వల్ల కావచ్చు, వాతావరణ మార్పుల వల్ల కావచ్చు.. ఏటా అనేక జాతులు కనుమరుగు అయిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు చెట్లు 350 రెట్లు వేగంగా అంతరించిపోతున్నాయని, పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు మడగాస్కర్​లో 12 వేల జాతుల మొక్కలు ఉన్నాయి. వీటిలో 80% మొక్కలు ఇక్కడ తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. ఇంగ్లాండ్​లో 1,859 జాతుల మొక్కలు ఉన్నాయి. వీటిలో 75 జాతులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. అయితే, ఆవాసాల ధ్వంసం, వాతావరణ మార్పుల వల్ల మడగాస్కర్ జీవవైవిధ్య హాట్​స్పాట్​గా మారింది. ఇంగ్లాండ్​లోని జీవజాతులకు ముప్పు తక్కువగా ఉన్నందున ఇక్కడి జీవవైవిధ్య ప్రదేశాలను కోల్డ్​స్పాట్లుగా పేర్కొంటున్నారు. కోల్డ్​స్పాట్ల కన్నా, హాట్​స్పాట్లలోని జీవజాతులు వేగంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని రీసెర్చర్లు గుర్తించారు. ముఖ్యంగా గడ్డి వంటి జాతుల మొక్కలు అత్యంత వేగంగా అంతరిస్తున్నాయని, వచ్చే 80 ఏళ్లలో అది వేల రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లెక్క తప్పొచ్చు కానీ.. కాపాడుకోకుంటే కష్టమే

భూమిపై అంతరించిపోయాయని అనుకున్న ఎన్నో జాతుల మొక్కలు, జంతువులు అప్పుడప్పుడూ మళ్లీ కనిపించి, ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి 431 జాతులు మళ్లీ కనిపించాయని ఇటీవలి ఓ నివేదిక వెల్లడించింది కూడా. అయితే, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భూమిపై జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అడవుల నరికివేత, జీవజాతులు ఎక్కువగా ఉండేచోట వాటి ఆవాసాల ధ్వంసం, శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలని చెబుతున్నారు.

Latest Updates