ఆరునెలల్లో 5జీ ఫోన్స్‌!

రెడీగా ఉన్న స్మార్ట్‌‌ఫోన్‌‌ కంపెనీలు

ఏప్రీల్‌‌-జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో

5జీ స్పెక్ట్రమ్‌‌ వేలం

ఇండియన్‌‌ కంపెనీలకు గడ్డుకాలమే

న్యూఢిల్లీ: ఇండియా మార్కెట్‌‌లో 5జీ స్మార్ట్‌‌ ఫోన్లు సందడి చేయనున్నాయి. ఈ ఏడాది ఫస్ట్‌‌ హాఫ్‌‌లోనే 5జీ ఫోన్ల హవా ప్రారంభమవుతుందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రీమియం రేంజ్‌‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికి, తక్కువ టైమ్‌‌లోనే తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌‌ఫోన్లు లభ్యమవుతాయన్నారు.   ప్రభుత్వం  ఏప్రిల్‌‌–జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో 5జీ  స్పెక్ట్రమ్‌‌ను వేలం వేసేందుకు  సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రీమియం లేదా లగ్జరీ(రూ. 30,000 కి పైన)  కేటగిరిలో  15–18 మోడల్స్‌‌(వేరియంట్లను విడిచిపెట్టి) లలో  5జీ అందుబాటులోకి రానుందని రీసెర్చ్‌‌ సంస్థ టెక్‌‌ఆర్క్‌‌ అంచనావేస్తోంది.  ఈ ఏడాది మొబైల్‌‌ కంపెనీలు 4జీ, 5జీ  రెండు వేరియంట్లలో రానున్నాయని,  2021 లో పూర్తి స్థాయిలో 5జీ ఫోన్లు అందుబాటులోకి వస్తాయని  ఇంటర్నేషనల్‌‌ డేటా కార్పొరేషన్‌‌ తెలిపింది.  ఇండియాలో అధిక మార్కెట్‌‌ వాటా ఉన్న చైనీస్‌‌ హ్యాండ్‌‌సెట్‌‌ షియోమి, ప్రపంచవ్యాప్తంగా పది 5జీ మోడల్స్‌‌ను లాంచ్‌‌ చేయనున్నామని ప్రకటించింది.  తాజాగా ఇండియాలో పాపులరైన రియల్‌‌మీ ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌లో 5జీ స్మార్ట్‌‌ఫోన్‌‌ను తీసుకురానున్నామని పేర్కొంది. ఒప్పో, వివో, వన్‌‌ ప్లస్‌‌, శామ్‌‌సంగ్‌‌ వంటి కంపెనీలు 2020 లో 5జీ ఫోన్లను తీసుకొచ్చేందుకు టైమ్‌‌లైన్‌‌ పెట్టుకున్నాయి. స్మార్ట్‌‌ఫోన్ కంపెనీలు 2020 లో హయ్యర్‌‌‌‌ ఎండ్‌‌లో  తమ 4 జీ వేరియంట్లతో కలిపి 5జీ మొబైల్స్‌‌ను  తీసుకురానున్నాయని ఐడీసీ ఇండియా రీసెర్చ్‌‌ డైరక్టర్‌‌‌‌ నవ్కేందర్‌‌‌‌ సింగ్‌‌ అన్నారు. 5జీ మొబైల్స్‌‌ 2021 లో చౌకవుతాయని తెలిపారు.

కంపెనీలు సిద్ధమే…

ఈ ఏడాది ఇండియాలో 15 లక్షల 5జీ ఫోన్లు అమ్ముడవుతాయని, ఇవి ఇండియలో ప్రస్తుతం అమ్ముడవుతున్న స్మార్ట్‌‌ఫోన్లలో ఒక శాతానికి సమానమని టెక్‌‌ఆర్క్‌‌ తెలిపింది. శామ్‌‌సంగ్‌‌, వన్‌‌ప్లస్‌‌, హువావే, వివో, ఒప్పో, షావోమీ, మైక్రోమ్యాక్స్  ఇప్పటికే యుఎస్‌‌, ఆస్ట్రేలియా,  యూరోప్‌‌లలో తమ 5జీ మోడల్స్‌‌ను తీసుకొచ్చాయి. చిప్‌‌సెట్‌‌ తయారి కంపెనీలయిన క్వాల్‌‌కామ్‌‌(స్నాప్‌‌డ్రాగన్‌‌), మీడియా టెక్‌‌(డిమ్నిస్టీ), శామ్‌‌సంగ్‌‌(ఎక్సీనోస్‌‌), హువావే(కిరిన్‌‌) కంపెనీలు వేగవంతమైన, పవర్‌‌ ఎఫిషియంట్‌‌ ప్రాసెసర్లను 5జీ టెక్నాలజీకి తగ్గట్టు డిజైన్‌‌ చేస్తున్నాయి. ప్రభుత్వం 5జీ ట్రయల్స్‌‌ ప్రారంభించే ముందే, స్మార్ట్‌‌ఫోన్‌‌ కంపెనీలు 5జీ డివైస్‌‌లతో సిద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు అన్నారు. 5జీ స్పెక్ట్రమ్‌‌ వేలానికి ముందే 5జీ ట్రయల్స్‌‌ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో నెలకొన్న గందరగోళం వలన అధిక ధర కలిగిన 5జీ స్పెక్ట్రమ్‌‌ వేలానికి టెలికాం కంపెనీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలని కౌంటర్‌‌‌‌ పాయింట్‌‌ రీసెర్చ్‌‌ డైరక్టర్‌‌‌‌ నీల్‌‌ షా అన్నారు. 5జీ నెట్‌‌వర్క్‌‌లో ఉన్న అనిశ్చితి వలన,  ఈ ఏడాది 5జీ మొబైల్స్‌‌ పూర్తి స్థాయిలో  కమర్షియలైజ్‌‌ కాబోవని అభిప్రాయపడ్డారు.     ఇండియన్‌‌ మార్కెట్లోకి 5జీ స్మార్ట్‌‌ఫోన్లు అడుగిడితే అది ఇండియా మొబైల్‌‌ తయారీ కంపెనీలను తీవ్రంగా నష్టపరుస్తుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ప్రీమియం  సెగ్మెంట్‌‌లో ఈ కంపెనీలకు మార్కెట్‌‌ వాటా తక్కువగా ఉండడం, టెక్నాలజీ, ఆర్‌‌‌‌ అండ్‌‌ డీ పరంగా పూర్తి వెనుకబడడం వంటి కారణాల వలన ఇండియన్‌‌ కంపెనీలు నష్టపోతాయని తెలిపారు.

Latest Updates