6 గంటలు రోడ్డుపైనే : మహిళలకు దక్కని అయ్యప్ప దర్శనం

శబరిమలలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం తమిళనాడుకు చెందిన మణితి సంస్థ నుంచి 11 మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకుంటామంటూ పంబకు చేరుకోవడంతో హైడ్రామా నెలకొంది. వీరంతా 50 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. వీరిలో ఆరుగురు ఇరుముడి కట్టుకొని వచ్చారు.

కేరళ సీఎం విజయన్‌కు ముందే సమాచారం ఇవ్వడంతో వారిని పోలీసులు పంబ వరకు తీసుకురాగలిగారు. తెల్లవారు జామున 3.30 గంటలకు పంబ చేరుకున్నప్పటికీ వందలాది మంది భక్తులు కొండపైకి వెళ్లే దారిని దిగ్బంధించారు. మహిళల బృందం అతి కష్టం మీద 100 మీటర్లు వెళ్లగలిగింది. భక్తులు, ఆందోళనకారులు వెంటపడడంతో మహిళలు పారిపోయి సమీపంలోని గార్డ్‌రూమ్‌లకు చేరుకున్నారు.

తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యప్ప దర్శనానికి వెళ్తామంటూ 6 గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. అయినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు. బృందానికి నేతృత్వం వహించిన సెల్వి మాట్లాడుతూ.. శబరిమల సన్నిధానానికి చేరుకోవాలన్న తమ మిషన్‌ను మాత్రం విరమించబోమని, మళ్లీ వస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు సీఎం విజయన్‌ నివాసం ఎదుట కూడా నిరసన కొనసాగించారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates