హైదరాబాద్​ లో మస్తుగా జాబ్ లు

  • దేశీయ సగటు నియామకాలతో పోలిస్తే 6% ఎక్కువ
  • గత ఏడాది కంటే 8 శాతం పెరిగిన ఉద్యోగాలు
  • నెలకు సగటున 2300 కొత్త ఉద్యోగాలు
  • ఎక్కువగా ఐటీలోనే.. ఆ తర్వాత రియల్​ బూమ్
  • నాలుగేళ్లలో 10లక్షల సాఫ్ట్​వేర్​ జాబ్​లు

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లో నియామకాల రేటు దేశీయ సగటు కన్నా 6 శాతం ఎక్కువగా నమోదైంది. గత ఏడాది కంటే నియామకాలు 8 శాతం పెరిగాయి. ఇది, ప్రముఖ రిక్రూట్​మెంట్  సంస్థ నౌక్రీ (naukri.com) సర్వే చేసి చెప్పిన విషయం. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు నియామకాలకు సంబంధించి ‘నౌకరీ ఇండెక్స్​2019’ నివేదికను సంస్థ విడుదల చేసింది. నియామకాల్లో హైదరాబాద్​ కన్నా ముందు ఢిల్లీ, చెన్నై, ముంబైలున్నా వాటికి దీటుగా దూసుకుపోతోందని సర్వేలో తేలింది. ఎక్కువగా ఐటీ, దాని అనుబంధ రంగాల్లోనే ఉద్యోగాలు భర్తీ అవుతున్నా, మిగతా రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే చెప్పింది. అడ్వర్టైజింగ్​, ఎఫ్​ఎంసీజీ (ఫుడ్​ అండ్​ కన్జ్యూమర్​ గూడ్స్​), మీడియా, ఆటోమొబైల్​, రియల్​ఎస్టేట్, బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్​, హోటళ్లు, అకౌంటింగ్​, ఎలక్ట్రానిక్స్​ రంగాల్లో యువత అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

అనుభవానికే ఫస్ట్​ ఓట్​

చాలా సంస్థలు అనుభవానికే పెద్ద పీట వేసినట్టు నౌక్రీ సర్వేలో తేలింది. కంపెనీలు అనుభవానికే ఓటు వేశాయి. ఆయా రిక్రూట్​మెంట్లలో ఈ ఏడాది మంచి అభివృద్ధి కనిపించింది. 8–16 ఏళ్ల అనుభవం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ఐటీలో పదేళ్ల అనుభవం ఉన్న వారితో పోలిస్తే అంతకన్నా తక్కువ అనుభవం ఉన్నవారికే ఉద్యోగాలు ఎక్కువగా వచ్చాయి. రియల్​ఎస్టేట్​, ఉత్పత్తి రంగాల్లో మాత్రం అనుభవమే ప్రధాన పాత్ర పోషించాయి.

నాలుగేళ్లలో పది లక్షల ఐటీ ఉద్యోగులు

నగరంలోని మెరుగైన మౌలిక వసతులు, ఇతరత్రా సౌకర్యాల దృష్ట్యా బయటి దేశాలకు చెందిన చాలా సంస్థలు ఇక్కడ కంపెనీలను పెడుతున్నాయి. దీంతో, స్థానిక యువతతో పాటు పక్క రాష్ట్రాలు, విదేశీ నిపుణులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​లో 5.6 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఆ సంఖ్య పది లక్షలు దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్​ సాఫ్ట్​వేర్​ ఎంటర్​ప్రైజెస్​ అసోసియేషన్​ (హైసియా) తెలిపింది. రాయదుర్గం, గచ్చిబౌలి, హైటెక్​సిటీ, మియాపూర్​ వంటి ఐటీ కారిడార్​లో కమర్షియల్​స్పేస్​ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, మెషీన్​ లెర్నింగ్​, డేటా సైన్స్​, బ్లాక్​ చెయిన్​, వర్చవల్​ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీలకు భారీ డిమాండ్​ ఉంటుందని, ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

నెలకు 2300 ఉద్యోగాలు

సగటున నెలకు 2300 మంది కొత్తగా ఉద్యోగాలు సంపాదిస్తున్నట్టు నౌక్రీ సర్వేలో తేలింది. అందులోనూ ఎక్కువగా ఐటీ రంగంలో భర్తీ అవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో రియల్​ఎస్టేట్​ ఉంది. చాలా కంపెనీలు అనుభవం, అర్హత ప్రాతిపదికనే నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 0–3 ఏళ్ల అనుభవం ఉన్న వారికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అవకాశాలు 17 శాతం పెరిగాయి. 4–7 ఏళ్ల అనుభవం ఉన్న వారికి 18 శాతం, 8–12 ఏళ్ల అనుభవం ఉన్నవారి రిక్రూట్​మెంట్​లో 12 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే ఎక్కువగా 2,656 మందిని కంపెనీలు ఉద్యోగంలోకి తీసుకున్నాయి. అందులో సగానికిపైగా సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​ రంగాల్లోనే ఉపాధి పొందారు. ఎఫ్​ఎంసీజీ రంగంలో వృద్ధి నమోదైందని సర్వే పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నియామకాల్లో 37 శాతం వృద్ధి ఉన్నట్లు వెల్లడించింది.

Latest Updates