ఒక్క రన్ ఇవ్వకుండా 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది

పొఖార (నేపాల్‌‌): ప్రపంచ క్రికెట్‌‌లో మరో సంచలనం. నేపాల్‌‌ మహిళా బౌలర్‌‌ అంజలి చాంద్‌‌.. ఒక్క పరుగూ ఇవ్వకుండా 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఓ ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌లో ఈ ఫీట్‌‌ను సాధించడం ఇదే తొలిసారి. అలాగే మహిళా టీ20లో ఇదే బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌. అంజలి (2.1 ఓవర్లు 6/0)  సూపర్‌‌ బౌలింగ్‌‌తో 13వ సౌత్‌‌ ఏషియన్‌‌ గేమ్స్‌‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌‌లో నేపాల్‌‌ 10 వికెట్ల తేడాతో మాల్దీవ్స్‌‌పై గ్రేట్‌‌ విక్టరీ సాధించింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన మాల్దీవ్స్‌‌ 10.1 ఓవర్లలో 16 పరుగులకు కుప్పకూలింది. కెరీర్‌‌లో తొలి మ్యాచ్‌‌ ఆడుతున్న అంజలి… 7వ ఓవర్‌‌లో మూడు, 9వ ఓవర్‌‌లో రెండు, 10వ ఓవర్‌‌లో ఒక్క వికెట్‌‌ తీసింది. అంటే కేవలం 12 బంతుల్లోనే 6 వికెట్లు పడగొట్టడం విశేషం. ఫలితంగా జనవరిలో మలేసియా బౌలర్‌‌ మాస్‌‌ ఎలిసా నెలకొల్పిన 6/3 రికార్డును అంజలి బద్దలుకొట్టింది. చైనాతో జరిగిన మ్యాచ్‌‌లో 4 ఓవర్లు వేసిన ఎలీసా ఈ రికార్డును సృష్టించింది. మాల్దీవ్స్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఇద్దరు సింగిల్‌‌ డిజిట్‌‌కు పరిమితంకాగా, ఎనిమిది మంది డకౌటయ్యారు. ఇందులో అంజలి ఆరుగుర్ని సున్నాకే ఔట్‌‌ చేయడం రేర్‌‌ ఫీట్‌‌. కరుణ రెండు వికెట్లు తీయగా, మరో ఇద్దరు రనౌటయ్యారు. టార్గెట్‌‌ ఛేజ్‌‌లో నేపాల్‌‌ 0.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 17 రన్స్‌‌ చేసి గెలిచింది.

Latest Updates