స్కూల్‌లో చిన్నారి చేతులు వెనక్కి విరిచి బేడీలు.. ఏడుస్తున్నా కరగని పోలీస్: వీడియో

పిల్లలన్నాక అల్లరి చేయడం సహజం. అది స్కూల్‌లో అయినా.. ఇంట్లో అయినా వాళ్లు అలానే ఉంటారు. ఆ అల్లరిని శృతిమించనీయకుండా మంచి దారిలో పెట్టేపని.. తల్లిదండ్రులు, టీచర్లదే. ఒక వేళ బడిలో పిల్లల ప్రవర్తన మరీ దారి తప్పితే పేరెంట్స్‌ని స్కూల్‌కి పిలిపించి మాట్లాడడం చూస్తుంటాం. కానీ, అలాంటి టీచర్లే.. ఫస్ట్‌ క్లాస్ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి స్కూల్‌లో అల్లరి చేసిందని ఏకంగా పోలీసులకు ఫోన్ చేశారు. ఆ వచ్చిన పోలీసులు మరింత దారుణంగా ప్రవర్తించారు. పసిపిల్ల అని చూడకుండా చేతులు వెనక్కి విరిచి.. బేడీలు వేసి స్టేషన్‌కి తీసుకెళ్లారు. ‘తప్పు చేశాను.. సెకండ్ చాన్స్ ఇవ్వండి.. ప్లీజ్’ అంటూ ఆ పాప ఏడుస్తున్నా అక్కడ ఏ ఒక్కరి గుండె కరగలేదు. ‘ప్లీజ్ సాయం చేయండి. నన్ను తీసుకెళ్లొద్దు’ అంటూ వేడుకుంది ఆ చిన్నారి. అయినా ఏ మాత్రం వినకుండా తమ కారులో కూర్చోబెట్టి.. స్టేషన్‌కి  తీసుకెళ్లారు పోలీసులు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

పోలీస్ బాడీ కెమెరాలో రికార్డయిన వీడియో

ఫ్లోరిడాలోని ఓర్లాండో ప్రాంతంలో ఉన్న ఓర్లాండో చార్టర్ స్కూల్‌లో 2019 సెప్టెంబర్‌లో ఈ అమానవీయ ఘటన జరిగింది. చిన్నారి స్కూల్ స్టాఫ్ పట్ల దురుసుగా ప్రవర్తించిందంటూ టీచర్లు పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న డెన్నిస్ టర్నర్ అనే అధికారి, అతడి సబార్డినేట్ రమోస్ అక్కడికి వెళ్లి చిన్నారిని అరెస్టు చేశారు. ఆ పాప తనను అరెస్టు చేయొద్దంటూ కన్నీరు పెడుతూ వేడుకున్నా వాళ్ల మనసు కరగలేదు. అయితే ఈ ఘటన మొత్తం టర్నర్ బాడీ క్యామ్‌లో రికార్డ్ అయింది. దీనిని ఆ చిన్నారి కుటుంబం తమ లాయర్ ద్వారా గత వారంలో తీసుకోగలిగారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరేళ్ల చిన్నారి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం దారుణమంటూ నెటిజన్లు పోలీసుల్ని తిట్టపోశారు. ఫిబ్రవరి 25న ట్విట్టర్‌లో పెట్టిన ఈ వీడియోను కేవలం మూడ్రోజుల్లోనే 35 లక్షల మందికిపైగా చూశారు. ఇది అమానుషమంటూ అందరూ స్పందిస్తున్నారు. అయితే ఆ చిన్నారి నల్లజాతికి చెందినది కాబట్టే ఇలా అరెస్టు చేశారంటూ లాయర్ తన పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో చిన్నారిని అరెస్టు చేయాలని ఆదేశించిన టర్నర్‌ను ఓర్లాండో పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని లాయర్ తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండానే అతడు ఈ పని చేసినట్లు వారు వివరణ ఇచ్చారన్నారు.

 

Latest Updates