పెళ్లిలో కిడ్నాప్ చేసి ఆరేళ్ల చిన్నారి హత్య

  • ఫంక్షన్ హాల్‌లో నుంచి తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
  • శరీరంపై గాయాలతో విగత జీవిగా పాప.. తల్లడిల్లిన అమ్మానాన్నలు

అప్పటి వరకు పెళ్లి మంటపంలో సందడిగా తిరుగాడిన చిన్నారి ఉసురు తీశారు గుర్తు తెలియని దుండగులు. కిలకిలా నవ్వుతూ.. ఆటలు తప్ప మరో లోకం తెలియని ఆ పాపను కర్కశంగా కొట్టి చంపారా దుర్మార్గులు.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిందీ ఘోరం.

తంబళ్లపల్లి అంగళ్లు సమీపంలో వర్షిణి అనే ఆరేళ్ల చిన్నారిని హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.  చేనేత నగర్లో కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లిన చిన్నారిని ఫంక్షన్ హాల్ నుంచి బయటకు తీసుకెళ్లాడో వ్యక్తి. అప్పటి వరకూ సందడిగా తిరుగుతున్న చిన్నారి కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు తల్లిదండ్రులు. కొద్ది సేపటికి కళ్యాణ మండపం సమీపంలోనే చిన్నారిని డెడ్ బాడీ కనిపించింది. ఆ చిట్టితల్లి శరీరంపై గాయాలను గుర్తించారు. చలాకీగా తిరిగే చిన్నారి విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు. వారు విలపిస్తుంటే.. ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి స్వస్థలం బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం. వర్షిణి తండ్రి సిద్ధారెడ్డి రైతు. కుటుంబ సభ్యులంతా రాత్రి పెళ్లికి హాజరయ్యారు. తల్లిదండ్రులు మండపంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు వర్షిణిని బయటకు తీసుకొచ్చినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ విజువల్ ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Latest Updates