డేటింగ్ మోజులో పడి లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు

తాను చేసిన బుద్ది తక్కువ పని వల్ల రూ.73.5 లక్షలు పోగొట్టుకున్నాడు ఓ పెద్ద మనిషి. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు విని, బుద్ధీ వక్రీకరించి అమ్మాయిలతో గడుపుదామనుకున్నాడు. వారి మాటలు నమ్మి ఆ ముఠాకి భారీ మొత్తంలో డబ్బు కూడా సమర్పించుకొన్నాడు. ఆ ముఠా మరికొంత డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడడంతో ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. నవీ ముంబైలోని ఖర్గర్ లో జరిగిందీ ఘటన.

ఖర్గర్ పీఎస్ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ తిదార్ తెలిపిన వివరాల ప్రకారం..  కోల్‌కతాలోని ఒక నకిలీ కాల్ సెంటర్‌ నుంచి స్నేహా(25) అనే యువతి ముంబైలోని ఖర్గర్ కి చెందిన ఓ వ్యక్తికి(65) కాల్ చేసింది. తాము ఓ డేటింగ్ సైట్ నిర్వహిస్తున్నామని, అందమైన యువతులతో సరదాగా గడపాలనుకుంటే.. ఆ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పింది. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి అందులో మెంబర్ షిప్ పొందినట్లయితే వారి ప్రాంతానికి దగ్గరలో ఉన్న యువతులతో గడపొచ్చని నమ్మబలికింది. రిజిస్ట్రేషన్, మెంబర్ షిప్ కోసమై కొంత చార్జీలు చెల్లించాలని చెప్పడంతో  ఆ వృద్ధుడు అందుకు సరేనని వారు చెప్పిన మొత్తాన్ని చెల్లించాడు.

కానీ అతనికి ఆ డేటింగ్ సైట్ ల గురించి అంత అవగాహాన లేకపోవడం, ఉపయోగించడం కూడా రానందున తన మెంబర్ షిప్ ని రద్దు చేయాలని కోరాడు. తాను చెల్లించిన చార్జీలను కూడా ఇమ్మని అడిగాడు. అందుకు ఒప్పుకోని ఆ ముఠా.. కాల్ చేసి అందమైన యువతులు కావాలని అడిగినందుకు  తిరిగి అతని మీదే పోలీస్ కంప్లయింట్ ఇస్తామని భయపెట్టారు.  ఆ మాటలకు భయపడిన ఆ పెద్ద మనిషి తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి తెలిస్తే తన పరువుపోతుందని, సమాజంలో తనకున్న పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని ఊరుకున్నాడు. ఇదే అదను అనుకున్న ఆ ముఠా ఆ వ్యక్తి నుంచి మరింత డబ్బు గుంజటానికి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డాడని నకిలీ లీగల్ నోటీసులు పంపారు. తాము అడిగినంత డబ్బు ఇస్తే ఆ లీగల్ నోటీసులను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.

బెదిరిపోయిన ఆ వృద్ధుడు.. వారి డీల్ కి సరేనని వారు చెప్పిన బ్యాంకు అకౌంట్లకు రూ. 73.5 లక్షలు ట్రాన్సఫర్ చేశాడు. ఇంకా డబ్బు పంపించాలని డిమండ్ చేయడంతో ఇక దిక్కు లేక ఖర్గర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ నకిలీ కాల్ సెంటర్ ముఠాకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిలో స్నేహ,  ఓ ట్రాన్స్ జెండర్, మరో వ్యక్తి ఉన్నారు.

Latest Updates