68 ఇంటర్​ కాలేజీలు క్లోజ్

హైదరాబాద్​, వెలుగు: రూల్స్​ పాటించని 68 ప్రైవేట్​, కార్పొరేట్​ జూనియర్​ కాలేజీలను ఇంటర్​బోర్డు మూసేసింది. ఫైర్​ ఎన్వోసీ, బిల్డింగ్​ పర్మిషన్​ లేకపోవడంతో కాలేజీలను సీజ్​ చేస్తున్నట్టు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, కాలేజీ మేనేజ్​మెంట్లకు మెయిల్​ ద్వారా మూసివేత నోటీసులు పంపామని బోర్డు కార్యదర్శి జలీల్​ తెలిపారు. తెలిపింది. మళ్లీ కాలేజీ తెరిస్తే క్రిమినల్​ కేసులు పెడతామని హెచ్చరించారు. 2019–2020 విద్యాసంవత్సరానికి గానూ 1,476  ప్రైవేటు కాలేజీలకు బోర్డు గుర్తింపునిచ్చింది. కొన్ని కాలేజీలు ఎలాంటి గుర్తింపు లేకుండానే కొనసాగుతున్నాయి. దీనిపై గతంలో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్​ వేశారు. దానిని విచారించిన హైకోర్టు చర్యలు తీసుకోవాల్సిందిగా బోర్డును ఆదేశించింది. పరీక్షల తర్వాత చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు బోర్డు తెలిపింది. దానికి తగ్గట్టు 68 కాలేజీలకు ఫైర్​ ఎన్వోసీ, బిల్డింగ్​ పర్మిషన్​ లేదని గుర్తించింది. వీటిలో నారాయణ కాలేజీకి చెందిన 26 క్యాంపస్​లు, శ్రీచైతన్య 18 క్యాంపస్​లు, గాయత్రి 8, ఎన్​ఆర్​ఐ 5  ఉండగా, మరో 11 కాలేజీలు వేరే మేనేజ్​మెంట్ల పరిధిలో ఉన్నాయి. అందులో ఎక్కువగా గ్రేటర్​ హైదరాబాద్​లోనే ఉన్నాయి. ఫైర్​ డిపార్ట్​మెంట్​ నుంచీ నివేదిక తెప్పించుకుంది బోర్డు. అన్నీ పరిశీలించి ఆయా కాలేజీలన్నింటికీ ఫిబ్రవరి 22న నోటీసులు జారీ చేసింది. నెలరోజులైనా కాలేజీ యాజమాన్యాల నుంచి రిప్లై రాలేదు. దీంతో ఆయా కాలేజీలన్నింటినీ మూసేస్తున్నట్టు ఇంటర్​ బోర్డు ప్రకటించింది.

మొత్తం 30 వేల స్టూడెంట్లు..

ఆయా కాలేజీల్లో 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఫస్టియర్​ స్టూడెంట్లు 15 వేల మంది దాకా ఉన్నారు. వాళ్లందరికీ సర్కార్​ కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్కార్​ కాలేజీల్లో చేరడం ఇష్టం లేని వాళ్లు వేరే కాలేజీలో చేరేలా ఆప్షన్​ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

Latest Updates