నెలన్నర అవుతున్నా.. పోస్టింగుల్లేవ్​

  • మూడుశాఖల్లో ఆగిపోయిన 699 గ్రూప్ 2 పోస్టింగులు
  • డిప్యూటీ తహశీల్దా ర్ ,ఆబ్కారీ ఎస్​ఐ, ఏసీటీవోలఎదురు చూపులు
  • సర్వీస్​ కాలంకోల్పోతామంటున్న అభ్యర్థులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వేసిన గ్రూప్​2 ఉద్యోగాలు పొందిన 699 మంది పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్నారు. మూడు శాఖల్లో పోస్టింగుల ఆగిపోయాయి. క్వాలిఫై అయినట్టు ప్రకటించి నెలన్నర అవుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో సర్వీసు కాలాన్ని కోల్పోతున్నామని వాళ్లు వాపోతున్నారు. 1,032 పోస్టుల భర్తీ కోసం 2015 డిసెంబర్​ 31న సర్కార్​ గ్రూప్​2 నోటిఫికేషన్​ ఇచ్చింది. 2016 నవంబర్​ 11, 13 తేదీల్లో పరీక్ష పెట్టింది. 2017 జూన్​2న టీఎస్​పీఎస్​సీ ఫలితాలు వెల్లడించింది. అయితే, పరీక్షల్లో వైట్నర్​ వాడకం, మరికొన్ని అంశాలపై కొందరు అభ్యర్థులు కోర్టుకెళ్లారు. కేసు ముగిసిన తర్వాత గత ఏడాది అక్టోబర్​ 25న టీఎస్​పీఎస్​సీ తుది ఫలితాలను ప్రకటించింది. ఇంటర్వ్యూలు పెట్టి ఫైనల్​గా 1,027 మందిని సెలెక్ట్​ చేసింది. అయితే, ఇప్పటికే అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్లు, సబ్​ రిజిస్ట్రార్లు, ఈవోపీఆర్​డీ, అసిస్టెంట్​ రిజిస్ట్రర్​ ఆఫీసర్లకు పోస్టింగులు ఇవ్వడంతో పాటు ట్రైనింగ్​ కూడా పూర్తి చేశారు. వాళ్లు డ్యూటీలూ చేస్తున్నారు.

ఆ మూడు శాఖల్లో ఆగిన పోస్టింగ్స్‌‌‌‌

మూడు శాఖలకు ఎంపికైన వారికి మాత్రం ఇంకా పోస్టింగ్​లు ఇవ్వలేదు. 259 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 284 అబ్కారీ ఎస్​ఐలు, 156 మంది అసిస్టెంట్​ కమర్షియల్​ ట్యాక్స్​ ఆఫీసర్​ (ఏసీటీవో)లకు నెల క్రితమే అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చినా ఇప్పటికీ పోస్టింగులివ్వలేదు. దీంతో వారు ఆవేదన చెందుతున్నారు. మిగతా వాళ్లకు అపాయింట్​మెంట్​ ఇచ్చిన వారంలోనే పోస్టింగులిచ్చినా, తమకు మాత్రం ఇంకా ఇవ్వలేదని కరీంనగర్​కు చెందిన ఏసీటీవోగా ఎంపికైన వ్యక్తి చెప్పారు. దాని వల్ల జీతంతో పాటు సర్వీస్​ కాలం కూడా పోతుందని ఆవేదన చెందారు. ఆ మూడు శాఖలకు ప్రిన్సిపల్​ సెక్రటరీగా ప్రస్తుత సీఎస్​ సోమేశ్​కుమార్​ ఉండేవారు. అయితే, శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన సీఎస్, ఎంపికైన అధికారుల శిక్షణపై చర్చించారు. వసతి, టూర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే, కేవలం శిక్షణ గురించి మాత్రమే మాట్లాడిన సీఎస్​, శిక్షణ, పోస్టింగుల తేదీల గురించి మాత్రం మాట్లాడలేదని ఎంపికైనోళ్లు వాపోతున్నారు. కాగా, మూడు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సీనియర్లకు తాత్కాలిక ప్రమోషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఎంపికైన ఉద్యోగులకు పోస్టింగులిస్తే, తాత్కాలికంగా డిప్యూటేషన్​ పొందినోళ్లు తమ యథాస్థానాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే, దాని వల్ల ఆయా శాఖల్లో టీం డిస్టర్బ్​ అవుతుందని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసన తర్వాతే ఎంపికైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా సర్కారు వద్ద నిధులు లేకపోవడం వల్లా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదన్న వాదనా వినిపిస్తోంది.

Latest Updates