ఆరో దశలో 63.48% శాతం ఓటింగ్

దేశవ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్​సభ స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 63.48 శాతం ఓటింగ్ ​నమోదైందని ఎన్నికల కమిషన్​ప్రకటించింది. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ ​కోవింద్​తోపాటు పలువురు వీవీఐపీలు ఈ విడతలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్​లలో కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఈసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పోలింగ్​ ఆగిపోవడంతో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌‌‌‌లో 80.35 శాతం, ఉత్తర ప్రదేశ్​లో అత్యల్పంగా 54.72 శాతం పోలింగ్​నమోదు కాగా, ఢిల్లీలో 59.74 శాతం, హర్యానాలో 68.17 శాతం, బీహార్‌‌‌‌లో 59.29 శాతం, జార్ఖండ్‌‌‌‌లో 64.50 శాతం, మధ్యప్రదేశ్‌‌‌‌లో 64.55 శాతం పోలింగ్‌‌‌‌ జరిగినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఎన్నికలతో దేశంలోని మొత్తం 543 లోక్​సభ స్థానాలకు గానూ ఇప్పటి వరకు మొత్తం 483 స్థానాల్లో పోలింగ్‌‌‌‌ ముగిసింది. మరో 59 స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్‌‌‌‌ జరగనుంది. హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్​లో పోలింగ్ ​ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్​లో ఓటర్లు పోలింగ్ ​కేంద్రాల ముందు బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్యూ అలాగే కొనసాగింది. సింగ్భూమ్​ నియోజకవర్గం ఛాయ్​బసాలోని పోలింగ్​ కేంద్రంలో శతాధిక వృద్ధురాలు పుపాలత పాల్(106) ఓటేశారు.

కేశ్పూర్​లో భారతీ ఘోష్​పై రాళ్ల దాడి..
పశ్చిమ బెంగాల్​లోని కేశ్పూర్​లో ఆరో విడత పోలింగ్​ హింసాత్మకంగా మారింది. స్థానికంగా పోలింగ్ తీరును పరిశీలించేందుకు వచ్చిన ఘాతల్​ బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ ​భారతీ ఘోష్ ను మహిళా ఓటర్లు అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్​పైకి రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఘోష్​కు గాయాలయ్యాయి. దీంతో అక్కడి నుంచి మరో చోటికి వెళ్లగా అక్కడా స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో రాళ్లదెబ్బలను తప్పించుకునేందుకు ఆమె గుడిలోకి వెళ్లి దాక్కున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసుల కాల్పుల్లో టీఎంసీ కార్యకర్త ఒకరు గాయపడ్డారని సమాచారం. అయితే, కాల్పులు జరిగిన విషయాన్ని ఎన్నికల కమిషన్​తోసిపుచ్చింది. ఓవైపు పోలింగ్​జరుగుతుండగా, ఎలాంటి పాస్​లు లేకుండా తిరుగుతున్న ఘోష్​ వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. రాళ్లదాడిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.

ఉత్తరప్రదేశ్​లో..
యూపీలోని సుల్తాన్​పూర్ ​నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ ​అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారంటూ బీజేపీ నేత మేనకా గాంధీ ఆరోపించారు. ఆజంగఢ్​లో ఎస్పీ కార్యకర్తల ఫిర్యాదుతో ప్రిసైడింగ్​అధికారిని ఈసీ విధుల నుంచి తప్పించింది. భదోహిలో పోలింగ్ ​ప్రాసెస్ ను కావాలని ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే దిననాథ్​ భాస్కర్ ​ప్రిసైడింగ్ ​అధికారిపై దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన అధికారిని ఆస్పత్రిలో చేర్పించి మరో అధికారిని అక్కడికి పంపించినట్లు ఈసీ తెలిపింది.

ఓటేసిన ప్రముఖులు
రాష్ట్రపతి భవన్​లోని సర్వోదయా విద్యాలయలో ఏర్పాటు చేసిన పోలింగ్​ బూత్​లో ప్రెసిడెంట్​రామ్​నాథ్​కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యూపీఏ చైర్​పర్సన్​ సోనియా గాంధీ, కాంగ్రెస్​చీఫ్​రాహుల్​గాంధీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ ​కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తదితరులు ఓటేశారు.

ఓటెయ్యని దిగ్విజయ్‌‌
భోపాల్‌‌: మధ్యప్రదేశ్‌‌ మాజీ సీఎం, భోపాల్‌‌ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్‌‌ సింగ్‌‌ ఈసారి ఓటు వేయలేదు. భోపాల్‌‌లో ఎన్నికల తీరును పరిశీలిస్తున్న ఆయనకు ఓటు వేయడం కుదరలేదు. దిగ్విజయ్‌‌సింగ్‌‌కు రాజ్‌‌ఘర్‌‌‌‌లో ఓటు హక్కు ఉండగా.. అది భోపాల్‌‌కు 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయన ఓటేయకపోవడంపై బీజేపీ కామెంట్స్‌‌ చేసింది. ఓటమికి భయపడి దిగ్విజయ్‌‌సింగ్‌‌ ఓటు వేసేందుకు వెళ్లలేదని ఎగతాళి చేసింది. “భోపాల్‌‌లో ఓడిపోతాడనే భయంతో దిగ్విజయ్‌‌ సింగ్‌‌ ఓటు వేసేందుకు వెళ్లలేదు. ఇక్కడే ఉండి ప్రచారం చేసుకుంటున్నారు. రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన సాధ్వికి భయపడుతున్నారు” అని బీజేపీ నేత అమిత్‌‌ మాల్వియా ట్వీట్‌‌ చేశారు. ‘భోపాల్‌‌లో ఓటింగ్‌‌ సరళిని పరిశీలిస్తూ ఓటు వెసేందుకు వెళ్లలేకపోయాను, ఎవరికీ భయపడటం లేదు’ అని దిగ్విజయ్‌‌సింగ్‌‌ చెప్పారు. భోపాల్‌‌లో కచ్చితంగా తానే గెలుస్తానని ధీమాగా చెప్పారు.

Latest Updates