చెరువులో పడి ఏడుగురు అమ్మాయిలు మృతి

చెరువులో పడి ఏడుగురు అమ్మాయిలు మృతి

లతేహార్: జార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలో ఘోరం జరిగింది. శ్రీగడ పరిధిలోని బుక్రు గ్రామంలో కర్మ పూజ తర్వాత నిర్వహించే నిమజ్జనోత్సవంలో 12 నుంచి 20 ఏండ్ల మధ్య వయసున్న ఏడుగురు అమ్మాయిలు చెరువులో పడి మృతి చెందారు. గ్రామానికి చెందిన 10 మంది అమ్మాయిలు నిమజ్జనం కోసం ‘కరం డాలి’తో చెరువులోకి దిగారు. ఈక్రమంలోనే ఇద్దరు అమ్మాయిలు మునిగిపోతూ సహాయం కోసం కేకలు వేశారు. దీంతో వారిని రక్షించే ప్రయత్నంలో ఒకరి వెనుక ఒకరు లోతైన చెరువులో పడి మునిగిపోయారు. ఇది గమనించిన చెరువు దగ్గరలోని గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారిని బయటకు తీశారు. ‘నలుగురు అమ్మాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు బాలుమఠ్ సీహెచ్‌‌‌‌సీకి తరలిస్తుండగా మరణించారు. ముగ్గురు అమ్మాయిలు సేఫ్‌‌గా బయటపడ్డారు’ అని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెలున్నారు. ఘటనపై జిల్లా డిప్యూటీ డెవలప్ మెంట్ కమిషనర్ శేఖర్ వర్మ విచారణకు ఆదేశించారు. ‘కరం డాలి’ (కారం చెట్టు కొమ్మ) నిమజ్జనం సమయంలో చెరువులో పడి ఏడుగురు అమ్మాయిలు మరణించిన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. బాధిత కుటుంబాలకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలి..’ అని సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.