బతికుండగానే అన్నను ఫ్రీజర్‌లో పెట్టేసిన తమ్ముడు: ఆత్మ పోలేదంటూ వింత సమాధానం

తమిళనాడులోని సేలంలో అమానవీయ ఘటన జరిగింది. సొంత అన్నను బతికుండగానే చనిపోయాడంటూ ఫ్రీజర్‌లో పెట్టేశాడు తమ్ముడు. దాదాపు 24 గంటల తర్వాత ఫ్రీజర్ కంపెనీ ఉద్యోగుల సమాచారంతో పోలీసులు అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. దీనిపై బాధితుడి తమ్ముడిని ప్రశ్నిస్తే తన అన్న చనిపోయాడు, కానీ అతడి ఆత్మ ఇంకా పోలేదంటూ వింత సమాధానం చెప్పాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు సేలం జిల్లా కందంపట్టిలో ఈ ఘటన జరిగింది. శరవణన్ అనే 70 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో తన అన్న బాలసుబ్రమణ్య కుమార్ (74) ఉంటున్నాడు. అనారోగ్యంతో రెండు నెలలుగా మంచంలో ఉన్న బాలసుబ్రమణ్య కుమార్ మరణించాడంటూ సోమవారం రాత్రి అతడి కుటుంబసభ్యులు ఫ్రీజర్ తెప్పించారు. అతడిని శరవణన్, అతడి కుమార్తె గీత కలిసి ఫ్రీజర్‌లో పెట్టారు. మంగళవారం సాయంత్రం ఆ ఫ్రీజర్‌ని వెనక్కి తీసుకోవాలని కంపెనీ ఉద్యోగులు అక్కడి వచ్చారు. అయితే ఆ సమయంలో సుబ్రమణ్య కుమార్ చేతులు కదలడం గమనించి అతడు బతికే ఉన్నాడని వాళ్లు అతడి కుటుంబసభ్యులకు చెప్పారు. కానీ వాళ్లు పట్టించుకోకపోవడంతో ఇరుగుపొరుగును పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకుని పోలీసులు అంబులెన్స్ పిలిపించి సుబ్రమణ్య కుమార్‌ను రక్షించి సేలంలోని మోహన్ కుమార మంగళం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు పంపారు. అయితే అంతకు ముందే అక్కడి చేరుకున్న తమిళనాడుకు చెందిన మీడియా చానెల్ శరవణన్‌ను దీనిపై ప్రశ్నించగా సోమవారం తన అన్న చనిపోయాడంటూ గట్టిగా చెప్పాడు. ఆ వెనుకనే సుబ్రమణ్య కుమార్ చేతులు కొట్టుకోవడం చూపించి అదేంటని అడిగితే, ఫిట్స్ వచ్చినట్టుందని అన్నాడు. చనిపోతే ఫిట్స్ ఎలా వస్తుందని ప్రశ్నించగా.. అతడి ఆత్మ ఇంకా పోలేదని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై సూరమంగళం పోలీసులు మాట్లాడుతూ సుబ్రమణ్య కుమార్ చనిపోవడంతోనే తాము ఫ్రీజర్‌లో పెట్టామని అతడి బంధువులు చెబుతున్నారని అన్నారు. దాదాపు 24 గంటల గడిచాక తర్వాతి రోజు ఫ్రీజర్ కంపెనీ ఉద్యోగులు వచ్చి చూస్తే బతికి ఉండడంతో తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు ఎస్ఐ రాజశేఖరన్. సుబ్రమణ్య కుమార్ తమ్ముడు, అతడి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Latest Updates