బీజేపీ, టీఎంసీ వర్గాల ఘర్షణ..8 మంది మృతి

8-dead-in-shootout-between-rival-indian-political-parties

బెంగాల్​లో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య మొదలైన గొడవ నాటకీయ మలుపులు తిరిగింది. శనివారం నాటి అల్లర్లలో చనిపోయిన కార్యకర్తల మృతదేహాలతో బీజేపీ నేతలు ఆదివారం బసంతి హైవేపై బైఠాయించారు. రోడ్డు మీదే అంతిమ సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులతో వందలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అయితే, పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో ఈ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేశారు. దీనికి బదులుగా వరుస ఆందోళనలు జరపనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల10న ‘బ్లాక్​డే’ నిర్వహిస్తామని చెప్పారు. 12న లాల్​బజార్​నుంచి పోలీస్​హెడ్​క్వార్టర్స్​వరకు ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెప్పారు. కాగా, ఎంతమంది చనిపోయారనే విషయంపై స్పష్టతలేదు. బీజేపీకి చెందిన నలుగురు కార్యకర్తలను కాల్చి చంపారని, మరొకరి మృతదేహాం ఆదివారం దొరికిందని బెంగాల్‌ బీజేపీ లీడర్‌‌ సుబ్రతా ఛటోపాధ్యాయ చెప్పారు. బూత్‌ లెవల్‌ మీటింగ్‌ జరుగుతున్న టైంలో బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని, టీఎంసీ కార్యకర్తను పార్టీ ఆఫీసులో నుంచి బయటకు లాకొచ్చి కొట్టారని స్టేట్‌ మినిస్టర్‌‌ జ్యోతి ప్రియ మాలిక్‌ ఆరోపించారు.

అసలేం జరిగింది..

లోక్​సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ వర్గాలు సంబరాలు జరుపుకుంటుండగా.. టీఎంసీ కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. గత పదిరోజులుగా అక్కడక్కడా అల్లర్లు చోటుచేసుకున్నాయి. శనివారం సందేశ్‌ఖలీలో బీజేపీ ఏర్పాటుచేసిన బ్యానర్లను టీఎంసీ కార్యకర్తలు తొలగించారు. ఇది కాస్తా గొడవకు దారితీసింది. రాత్రిపూట రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో టీఎంసీ కార్యకర్తలు ఇద్దరు, బీజేపీ కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు. అయితే, కనీసం ఎనిమిది మంది చనిపోయారని ప్రచారం జరుగుతోంది. తమ కార్యకర్తలు ఐదుగురు చనిపోయారని బీజేపీ.. తమ కార్యకర్తలు ముగ్గురు మరణించారని టీఎంసీ వర్గాలు ప్రకటించాయి. రెండు పార్టీలకు చెందిన 18 మంది కార్యకర్తలు కనిపించడంలేదని సమాచారం. ఈ అల్లర్లు ఆదివారం ఉదయం కూడా కొనసాగాయి. మిస్సైన కార్యకర్తల ఆచూకీ కోసం ఓవైపు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. బీజేపీ, టీఎంసీ వర్గాలు మాత్రం పరస్పరం ఆరోపణలకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లర్లలో చనిపోయిన కార్యకర్తల మృతదేహాలను కోల్​కతా తరలించి, అక్కడ అంత్యక్రియలు జరపాలని బీజేపీ నిర్ణయించింది. దీనికోసం ఏర్పాట్లు కూడా చేసింది. మృతదేహాలతో కదిలిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మృతదేహాలతో బీజేపీ నేతలు హైవే మీద బైఠాయించారు. అక్కడే అంత్యక్రియలకు ప్రయత్నించారు.

Latest Updates