పోలీసులపై కాల్పులు జరిపిన రౌడీలు..8 మంది మృతి

  • ఉత్తర్‌‌ప్రదేశ్‌లో ఘటన

లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై క్రిమినల్‌, ఆయన అనుచరులు కాల్పులకు పాల్పడటంతో 8 మంది పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌ రాజధాని లక్నోకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిక్రూ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మూడు పోలీస్‌ స్టేషన్లకు చెందిన వారు చనిపోయారు. వారిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవేంద్ర కుమార్‌‌ మిశ్రా, ముగ్గురు సబ్‌ఇన్స్‌పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. దాదాపు 60 క్రిమినల్‌ కేసుల్లో మోస్ట్‌ క్రిమినల్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వాళ్లు అక్కడికక్కడే చనిపోయినట్లు కాన్పూర్‌‌ పోలీస్‌ చీఫ్‌ దినేశ్‌ కుమార్‌‌ చెప్పారు. ఇటీవల జరిగిన హత్యా యత్నం కేసులో నిందితుడని, దానికి సంబంధించి అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా ప్రీప్లాన్డ్‌గా నాలుగువైపుల నుంచి ఎటాక్‌ చేశారని అన్నారు. రోడ్డు బ్లాక్‌ చేశారని, పోలీసులు వెళ్లి దాన్ని క్లియర్‌‌ చేస్తుండగా కాల్పులకు జరిపారని అన్నారు. ఈ ఘటనను యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్‌ ఖండించారు. దీనిపై రిపోర్ట్‌ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Latest Updates