సైనిక దాడిలో 80 మంది జిహాదీలు హతం

జిహాదీలు ఉత్తర బుర్కినా ఫాసోలోని ఒక పట్టణంపై దాడి చేయడంతో, సైనికులు చేసిన ప్రతిదాడిలో 80 మంది జిహాదీలతో పాటూ మరో 35 మంది పౌరులు చనిపోయారు. బుర్కినా ఫాసోలో జరిగిన ఈ దాడిలో ఏడుగురు సైనికులు కూడా మరణించారు. మాలితో దేశ సరిహద్దు కలిగి ఉన్న ఆఫ్రికాకు చెందిన సహేల్ ప్రాంతంలోని అర్బిందా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడి కొన్ని గంటల పాటు కొనసాగిందని సైనికాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో చనిపోయిన 35 మంది పౌరులలో ఎక్కువమంది మహిళలే ఉండటం గమనార్హం. అయితే ఆ సమయంలో వారంతా అక్కడ ఎందుకున్నారో తెలియాల్సి ఉందని ఆఫ్రికా దేశ అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ అన్నారు.

ఈ ప్రాంతంలో జిహాదీ దాడులు తరచూ జరుగుతూనే ఉంటాయి, కానీ మంగళవారం జరిగిన ఈ దాడి మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో జిహీదీలను అంతమొందించింది. ఇటువంటి సైనిక దాడులు జరిగినప్పుడు, ఉగ్రవాద సంస్థలు వెంటనే స్పందిస్తాయి, కానీ.. దాడులలో సామాన్య పౌరులు ఎక్కువగా చనిపోతే మాత్రం వెంటనే స్పందించరు. చాలా సంవత్సరాల నుంచి బుర్కినా ఫాసోలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతూ ఉంది. అందుకే అక్కడ జిహాదీలను నియంత్రించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వ నేతృత్వంలోని సైనిక బలగాలు 2013 నుంచి జోక్యం చేసుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఇటువంటి దాడులు తరచుగా జరుగుతండటంతో దాదాపు అర మిలియన్‌కు పైగా ప్రజలు ఇప్పటికే ఆ ప్రాంతాలనుంచి వేరే ప్రాంతాలకు వలసవెళ్లారు. గత నెలలో తూర్పు బుర్కినా ఫాసోలో కెనడియన్ మైనింగ్ కంపెనీకి చెందిన 37 మంది ఉద్యోగులను తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను జిహాదీలు కాల్చి చంపారు. బుర్కినా ఫాసో యొక్క మిలిటరీకి ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ శిక్షణ ఇచ్చాయి. అయినా కూడా ఉగ్రవాదాన్ని నిరోధించడంలో బుర్కినా ఫాసో సైన్యం విఫలమవుతూ వస్తుంది.

Latest Updates