లేజీ పిల్లలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారంటే?

‘అబ్బా అప్పుడే తెల్లారిందా..! ఇంకో గంట సేపు పడుకుందాం..!’.. అలారంను రీసెట్​ చేసి చెద్దరు కప్పేసిన అబ్బాయి!

‘ఇప్పటికే బాగా చేసేసినం. ఇవ్వాళ్టికి చాల్లే ఈ ఎక్సర్​సైజ్​’ ఓ గంట సేపు చేయగానే ఓ అమ్మాయి నిట్టూర్పు!

ఏదైతేనేం పిల్లలు బద్ధకస్థులైపోతున్నారు. ప్రపంచంలో దాదాపు 80 శాతం మంది పిల్లలు లేజీగానే ఉంటున్నారు. అందులోనూ ఆడపిల్లలే ఎక్కువ బద్ధకస్తులున్నారు. దేశాల వారీగా చూస్తే లేజీ పిల్లల్లో  దక్షిణ కొరియా టాప్​లో ఉంది! అక్కడ 94 శాతం మంది పిల్లలు బద్ధకస్తులేనట. దాంతో పాటు ఫిలిప్పీన్స్​, కంబోడియా, సూడాన్​ వంటి దేశాల్లోని 90 శాతం మందికిపైగా పిల్లలు లేజీగా ఉంటున్నారట. కనీసం గంట పాటైనా ఫిజికల్​ యాక్టివిటీ లేని 11 నుంచి 17 ఏళ్ల వయసున్న లేజీ పిల్లలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారో  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) ఓ స్టడీ చేసి రిపోర్టును విడుదల చేసింది. డబ్ల్యూహెచ్​వో డాక్టర్​ రెజీనా గుథోల్డ్​ ఈ రిపోర్టును తయారు చేశారు. ఈ జాబితాలో మనం మంచి పొజిషన్​లోనే ఉన్నాం. అయితే, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లలు లావు అయ్యే ముప్పు పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాదేశ్​ పిల్లలు యాక్టివ్​

యాక్టివ్​ పిల్లలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా మంచి స్థానంలోనే ఉంది. దాదాపు 26 శాతం మంది పిల్లలు శరీరానికి అవసరమైనంత మేర ఎక్సర్​సైజులు చేస్తున్నారు. ఇనాక్టివ్​గా ఉంటున్న పిల్లలు 73.9 శాతం. యాక్టివ్​గా ఉంటున్న పిల్లల జాబితాలో మన దేశం ఏడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్​ టాప్​లో ఉంది. 34 శాతం మంది యాక్టివ్​ పిల్లలతో ప్రపంచంలో నంబర్​ వన్​ దేశంగా క్రెడిట్​ కొట్టేసింది. 66.1 శాతం మంది బంగ్లాదేశ్​ పిల్లలు గంట సేపు కూడా ఎక్సర్​సైజు చేయట్లేదక్కడ. అయితే, ఎంత టాప్​లో నిలిచినా 16 లక్షల మంది పిల్లల్లో ఎక్సర్​సైజులు చేస్తున్న వారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్​వో పేర్కొంది. ఇక, రెండో స్థానంలో స్లొవేకియా (28.5%), మూడో స్థానంలో ఐర్లాండ్​ (28.2%), నాలుగో స్థానంలో అమెరికా (28%), ఐదో స్థానంలో బల్గేరియా (26.7%) ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కనీసం గంట సేపు ఎక్సర్​సైజు చేస్తూ యాక్టివ్​గా ఉంటున్న పిల్లల సంఖ్య కేవలం 20 శాతంగా ఉందని డబ్ల్యూహెచ్​వో రిపోర్టు పేర్కొంది. 146 దేశాల్లో ఆడపిల్లలే ఎక్కువ లేజీగా ఉంటున్నారని తేల్చింది. ఈ జాబితాలో టోంగా, సామోవా, ఆఫ్గనిస్థాన్​, జాంబియాలే ఎక్కువ ట్రెండింగ్​లో ఉన్నాయి. ఇక, బద్ధకపు అబ్బాయిలు ఎక్కువున్న దేశాల జాబితాలో ఇండియా, అమెరికా, బంగ్లాదేశ్​ టాప్​ 3లో ఉన్నాయి.

ఎలక్ట్రానిక్​ యుగంలో పట్టించుకోవట్లే

పిల్లలు లేజీగా ఉండడానికి కారణం ఇప్పుడున్న ఎలక్ట్రానిక్​ పరికరాలే కారణమని అంటున్నారు. ఎప్పుడూ ఫోన్లకు లేదంటే కంప్యూటర్లకు పిల్లలకు అతుక్కుపోతుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. ‘‘మారుతున్న ప్రపంచంతో పాటే జనమూ మారుతున్నారు. ఎలక్ట్రానిక్​ రెవల్యూషన్​ జనాలను పూర్తిగా మార్చేసింది. పిల్లల జీవితాలనూ కట్టిపడేసింది. నేర్చుకోవాలన్నా, పని చేయాలన్నా, ఆడుకోవాలన్నా, ప్రయాణానికైనా, దేనికైనా వాటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో అందరూ ఇంటికే పరిమితమైపోతున్నారు. కుర్చీలు, మంచాలకు అతుక్కుపోతున్నారు. ఫలితంగా శరీరానికి సరైన శ్రమ ఉండట్లేదు” అని కెనడాలోని చిల్డ్రెన్స్​ హాస్పిటల్​ ఆఫ్​ ఈస్టర్న్​ ఒంటారియో రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ డాక్టర్​ మార్క్​ ట్రెంబ్లే అన్నారు. ఎక్సర్​సైజులు చేయకపోవడం వల్ల పిల్లలు లావైపోతారని, దాంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని బ్రిటన్​ రాయల్​ కాలేజ్​ ఆఫ్​ పీడియాట్రిక్స్​ అండ్​ చైల్డ్​ హెల్త్​ ప్రొఫెసర్​ వినర్​ అన్నారు.

Latest Updates