ఒక్క రోజులో 85 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. భార‌త ఆర్మీ జవాన్ల‌లోనూ పాజిటివ్ కేసులు వ‌రుస‌గా న‌మోద‌వుతున్నాయి. ఢిల్లీలో లా అండ్ ఆర్డ‌ర్ డ్యూటీలో ఉన్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు స‌హా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సైనికులు, అధికారులకు వైర‌స్ సోకుతున్న కేసులు క‌నిపిస్తున్నాయి. బుధ‌వారం ఒక్క రోజులోనే 85 మంది బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని అధికారులు తెలిపారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డిన బీఎస్ఎఫ్ జ‌వాన్ల సంఖ్య 154కు చేరిన‌ట్లు వెల్ల‌డించారు.

ఢిల్లీలోనే ఎక్కువ‌గా బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా

క‌రోనా సోకిన‌ బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌లో అత్య‌ధికంగా ఢిల్లీలోని జామియా, చాందినీ మ‌హ‌ల్ ఏరియాల్లో శాంతిభ‌ద్ర‌తల ప‌రిర‌క్ష‌ణ‌ డ్యూటీలో ఉన్న 60 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత‌ త్రిపుర‌లో 37 మంది జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కాగా, మంగ‌ళ‌వారం వ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డిన‌ బీఎస్ఎఫ్ జ‌వాన్ల సంఖ్య 69గా ఉంది. బుధ‌వారం భారీగా 85 కొత్త కేసులు రావ‌డంతో ఆ సంఖ్య 154కు చేరింది. ఇవాళ పాజ‌టివ్ వ‌చ్చిన వారిలో 30 మంది రాజ‌స్థాన్ లోని జోధ్ పూర్ లో ఇంట‌ర్న‌ల్ డ్యూటీలో ఉన్న‌జ‌వాన్లేన‌ని అధికారులు తెలిపారు.

రెండ్రోజుల త‌ర్వాత బీఎస్ఎఫ్ హెడ్ క్వార్ట‌ర్స్ ఓపెన్

దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది బీఎస్ఎఫ్ జ‌వాన్లు పాకిస్థాన్, బంగ్లాదేశ్ బోర్డ‌ర్ల‌లో నిత్యం ప‌హారా కాస్తున్నారు. ఢిల్లీలోని బీఎస్ఎఫ్ హెడ్ క్వార్ట‌ర్స్ లో నూ క‌రోనా కేసులు రావ‌డంతో రెండ్రోజుల క్రితం ఆఫీసులోని రెండు ఫ్లోర్ల‌ను పూర్తిగా మూసేశారు. గోడ‌లు, ఫ‌ర్నీచ‌ర్ స‌హా అన్ని వ‌స్తువుల‌ను శానిటైజ్ చేయించి, పూర్తిగా సేఫ్ అనుకున్న త‌ర్వాత బుధ‌వారం మ‌ళ్లీ ఆ రెండు ఫ్లోర్ల‌ను తిరిగి ఓపెన్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 49,391 మందికి క‌రోనా సోకింది. అందులో 1694 మంది మ‌ర‌ణించ‌గా.. 14183 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Latest Updates