
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారానికి (మే1) 86వ రోజుకు చేరుకుంది. సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగింది. లోకేష్ పాదయాత్ర 1100 కిలోమీటర్లు పూర్తయింది.ఈ సందర్భంగా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈరోజు (మే1) న ఉదయం ఎమ్మిగనూరు శివారులోని మదర్ థెరిస్సా కళాశాల నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమయింది. ఉదయం 11.45 గంటలకు రాళ్లదొడ్డిలో బీసీ సామాజికవర్గం ప్రజలతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గోనెగండ్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద మైనారిటీలతో భేటీ తరువాత . ఎస్సీ సామాజికవర్గీయులతో కూడా సమావేశమయ్యారు.
జగన్ కొత్త డ్రామా
మేడే సందర్భంగా కార్మికులకు లోకేశ్ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు చిందిచే స్వేధమే ఈ ప్రపంచానికి సౌభాగ్యమని వర్ణించారు. శ్రామిక శక్తే సమాజ ప్రగతికి చోధక శక్తి అని పేర్కొన్నారు. నిన్నటి (ఏప్రిల్30) పాదయాత్రలో..పదవిలోకి వచ్చినప్పటి నుంచి మోసాలతో ప్రజలను జగన్ వంచిస్తూ వచ్చారని లోకేశ్ ఆక్షేపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలనూ మోసం చేశారని ధ్వజమెత్తారు. స్పందనకు కాల్ చేస్తే స్పందించని ముఖ్యమంత్రి.. జగన్కు చెబుదాం పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు
వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నా..ప్రభుత్వంలో పట్టించుకొనే నాధుడే లేడని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరానికి సుమారు రూ.90వేలు పెట్టుబడి పెట్టి మొక్కజొన్న వేస్తే, చేతికి అందివచ్చిన పంట మొత్తం ఒక్కరోజులో తుడిచిపెట్టుకుపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ వారికి ధైర్యం చెప్పి పంట నష్టం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఒత్తిడి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రసంగిస్తూ, “చంద్రబాబు నాయుడుని, మా తెలుగుదేశం పార్టీ నేతలని తిట్టిపోయడానికి మంత్రులు పోటీలు పడుతుంటారు. కానీ అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి మీలో ఎవరికీ తీరిక లేదా? రైతులు ఇంతగా ఆవేదన చెందుతుంటే ముఖ్యమంత్రికి లేదా వ్యవసాయమంత్రికి వారిని పరామర్శించే తీరిక,ఆసక్తి లేదా? రైతుల కోసం వేలు, లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నామని గొప్పలు చెప్పుకొంటుంటారు కదా… మరిప్పుడెందుకు ఎవరూ ముందుకు వచ్చి రైతులను ఆదుకోవడం లేదు? ఇంకా ఎంతకాలం రైతులు మీ కోసం ఎదురుచూడాలి?” అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.
తాను ఎస్సీలను అవమానించానంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్నినారా లోకేష్ ఖండించారు. “ఒకవేళ తాను సభలో ఎస్సీ, బీసీలను అవమానిస్తూ మాట్లాడితే వారెందుకు చప్పట్లు కొడతారు జగన్ రెడ్డీ? నా గురించి తప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇంత చిన్న విషయం సరిచూసుకోలేకపోయావు. నేను ఎస్సీ, బీసీలను అవమానించిన్నట్లు నిరూపించగలరా? నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పు కొంటాను అంటూ నారా లోకేష్ సవాలు విసిరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి భేటీ అయినందుకే వైసీపీ మంత్రులు ఎంతగా కడుపు మంటతో రగిలిపోయారో అందరూ చూశారన్నారు.