
హైదరాబాద్, వెలుగు:
భూ రికార్డుల ప్రక్షాళనను రెండేళ్ల కిందట సర్కారు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసింది. రెండేళ్లలో 58 లక్షల మందికి పట్టాలిచ్చింది. కానీ ఇచ్చిన పట్టా పుస్తకాల్లో విపరీతమైన తప్పులు. పైగా ఇంకా 9 లక్షల దరఖాస్తులు పెండింగ్. అన్నింటికీ రెవెన్యూ అధికారులే బాధ్యులని రైతులు, భూ యజమానులు అంటుంటే.. తప్పు తమది కాదని, ధరణి సాఫ్ట్వేర్దని అధికారులు అంటున్నారు. సవరణ చేసే ఆప్షనే తమకు లేదని తహసీల్దార్లు చెబుతున్నారు.
‘మా భూమి’ భూరికార్డులు గల్లంతు
భూమి రికార్డులను గతంలో మాన్యువల్‌గానే నిర్వహించేవారు. ఇప్పటికీ ఆ విధానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల కంప్యూటరీకరణ మొదలైంది. తొలుత రెవెన్యూ సిబ్బందికే కనిపించేలా వెబ్‌ల్యాండ్‌ను రూపొందించారు. మాన్యువల్‌గా ఉన్న పహాణీ, వన్ బీ రికార్డులను సర్వే నంబర్లు, ఖాతా నంబర్లవారీగా కంప్యూటరీకరించారు. ‘మా భూమి’ పేరిట రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను సీనియర్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్‌గా ఉన్నప్పుడు 2016 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. వెబ్సైట్లో జిల్లా, మండలం, గ్రామం వివరాలతోపాటు సర్వే నంబర్/ఖాతా నంబర్ ఎంటర్ చేస్తే పహాణీ కనిపించేది. మా భూమి వెబ్సైట్లో డేటా ఉండగానే ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో భూ రికార్డుల ప్రక్షాళన స్టార్ట్ చేసింది. ప్రక్షాళనంటూ గతంలోని వెబ్‌ల్యాండ్, మాభూమి సైట్లను పక్కనబెట్టి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టం(ధరణి) పేరిట కొత్త సైట్ రూపొందించేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(ఐఎల్ఎఫ్ఎస్) సంస్థకు పని అప్పగించింది. రూ. 116.05 కోట్లతో చేపట్టిన ధరణి ప్రాజెక్టును సంస్థ మధ్యలోనే ఎత్తేసింది. పైగా మాభూమి, వెబ్‌ల్యాండ్‌లోని వేలాది సర్వే నంబర్లు, భూముల వివరాలు ధరణిలో మాయమయ్యాయి. ఉన్న వాటిలో తప్పులున్నాయి. దీంతో అధికారికంగా ప్రారంభించడం నిలిపివేశారు. అనేక సర్కారీ వెబ్సైట్లను సమర్థంగా నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్ సంస్థలకు అప్పగించకుండా ఐఎల్ఎఫ్ఎస్కు ధరణి బాధ్యతలివ్వడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి.
ఆప్షన్లు ఇవ్వరు.. పరిష్కరించరు
సర్వే నంబర్లు, భూ విస్తీర్ణంలో తప్పులతోనే రైతులకు పాస్ పుస్తకాలిచ్చారు. ఈ తప్పులను సవరించే అధికారం ఇప్పుడు తహసీల్దార్లకు లేదు. వీటి కోసం ఫైల్ రెడీ చేసి ఆర్డీఓ, జేసీకి పంపాలి. వాళ్లు లాగిన్ అయి సవరణ చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. ఇదంతా ప్రహసనమవడంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు ఎల్‌ఆర్‌యూపీలో పరిష్కారం కాక పార్ట్–బీలో చేర్చిన వివాదాస్పద భూములు సుమారు 16 లక్షల ఎకరాలున్నాయి. వీటి పరిష్కారం రెవెన్యూ అధికారుల చేతుల్లో లేదు. ఈ భూములకు నిజమైన హక్కుదారులెవరో తేల్చేందుకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో పార్ట్‌బీ భూములకు యజమానులుగా చెప్పుకుంటున్న రైతులు రోజూ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.