టీమిండియా ప్రపంచకప్ గెలిచి సరిగ్గా 9సంవత్సరాలు

టీమిండియా రెండవసారి ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. ఎమ్ ఎస్ ధోనీ నాయకత్వంలో 2011 ఎప్రిల్ 2న వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. ఆట చివరలో ధోనీ కొట్టిన సిక్స్ క్రికెట్ అభిమానుల గుండెల్లో చెదరని సంతకం. భారత్ రెండవసారి ప్రపంచకప్‌ను అందుకోవడానికి సరిగ్గా 27సంవత్సరాల, 9నెలల, 7రోజులు పట్టింది. అంతకు ముందు కపిల్ దేవ్ నాయకత్వంలో 1983 జూన్ 25న  భారత్ ప్రపంచకప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

విజయాలతో పాటు అపజయాలు ఉంటాయన్నట్టు…  2007 ప్రపంచకప్‌లో టీమిండియా నమోదు చేసిన పేలవ ప్రదర్శన  భారత క్రికెట్ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో అభిమానులు క్రికెటర్ల ఫొటోలను కాలబెట్టి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత జట్టులో పెద్దఎత్తున మార్పులు జరిగాయి. టీమిండియా కోచ్‌గా గ్రేగ్ చాపెల్ వైదొలిగాడు. దీంతో బీసీసీఐ వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్, లాల్చంద్ రాజ్ పూత్, రవిశాస్త్రి వంటి వారికి జట్టు నిర్వహణలో భాగం చేసింది.

2007 ప్రపంచకప్ తర్వాత నాయకత్వ మార్పు చేయడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాడ్‌లో జరిగిన సిరీస్ లో టీమిండియా ఓడిన తర్వాత రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ధోనీ సారధ్యంలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. దీంతో ధోనీకి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. 2011 ప్రపంచకప్  స్వదేశంలో నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.  ప్రపంచకప్ ను భారత్ కు అందించేటీంను తయారు చేయడానికి  ధోనీ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు వాటిని పలువురు సీనియర్లు తప్పుపట్టారు. అవేవీ పట్టించుకోకుండా ధోని జట్టులో మార్పులు చేశాడు. ఫలితం 2011లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది.

Latest Updates