91లక్షల మంది వలస కూలీలను తరలించాం

  • సుప్రీం కోర్టుకు చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక శ్రామిక్‌ రైళ్ల ద్వారా 91 లక్షల మంది వలస కూలీలను సొంత ఊళ్లకు తరలించామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. వలస కూలీల విషయాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు గురువారం కేసును విచారించింది. కేసును విచారిస్తున్న ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్‌ కేంద్రానికి 50 ప్రశ్నలు సందించింది. “ వలస కార్మికుల మేజర్‌‌ ప్రాబ్లమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఫుడ్‌. దాంట్లో మొదటిది ట్రాన్స్‌పోర్టే. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత వాళ్లంతా వారం పాటు ఆగాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒకేసారి ట్రాన్స్‌పోర్ట్‌ కల్పించడం వీలు కాదని అర్థం చేసుకోగలము కానీ వారికి ఉండేందుకు షల్టర్‌‌, ఫుడ్‌ ఇస్తున్నారా?” అని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌‌ జనరల్‌ తుషార్‌‌ మెహతా కోర్టులో వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు శ్రామిక్‌ రైళ్లలో 91 లక్షల మందిని తరలించామని, వారిలో బీహార్‌‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్క వలస కూలీ సొంత ఊరికి చేరే వరకు రైళ్లు ఆపేది లేదని చెప్పారు. వలస కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై కాంగ్రెస్‌ నేత మేధా పాట్కర్‌‌ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

Latest Updates