కరోనా కేసుల్లో 60 ఏళ్ల లోపు వాళ్లే 91 శాతం

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో మరో 17 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన 15 మంది, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరితో కలిపి రాష్ర్టంలో కరోనా బాధితుల సంఖ్య 1,061కి చేరింది. శనివారం మరో వ్యక్తి మరణించారు (చనిపోయిన వ్యక్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు). దీంతో మృతుల సంఖ్య 29కి చేరింది. 35 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తంగా వైరస్ బారిన పడి, కోలుకున్న వారి సంఖ్య 499కి చేరింది. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో ఇది 47 %. మరో 533 మంది వివిధ దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు.

60 ఏండ్ల లోపు వాళ్లే 91 శాతం

రాష్ర్టంలో కరోనా బారిన పడిన వారిలో 705 మంది మగవాళ్లు, 356 మంది ఆడవాళ్లు ఉన్నారు. వైరస్ సోకిన వారిలో 91 శాతం మంది 60 ఏండ్ల కంటే తక్కువ వయసున్నవారే. ఇందులో 9 శాతం మంది పదేండ్ల లోపు వయసున్న పిల్లలు ఉన్నారు. 61 నుంచి 80 ఏండ్ల వయసున్న వారు కేవలం 9 శాతం మాత్రమేనని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

16 జిల్లాల్లో 14 రోజులుగా నిల్‌

రాష్ర్టంలోని 16 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇందులో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌‌, మెదక్‌, సంగారెడ్డి, భూపాల్‌పల్లి, జగిత్యాల, నాగర్‌‌కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నారాయణ్​పేట్ జిల్లాలు ఉన్నాయి. శనివారం డిశ్చార్జ్‌ అయిన 35 మందిలో 24 మంది జీహెచ్‌ఎంసీ, నలుగురు సూర్యాపేట, నలుగురు వికారాబాద్​తోపాటు అసిఫాబాద్‌, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఉన్నారు.

Latest Updates