వీడియో: 40 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకున్న 93 ఏళ్ల మహిళ

ఎప్పుడో 40 ఏళ్ల కిందట 1980లో తప్పిపోయిన మహిళ మళ్లీ ఇప్పుడు తన కుటుంబసభ్యులను కలుసుకుంది. చాలామంది తమ ఇంట్లో ఎవరైనా ముసలివాళ్లుంటే వారికి సేవ చేయలేక తీసుకెళ్లి ఓల్డేజీ హోంలో చేరుస్తుంటారు. కానీ.. నాగ్ పూర్ కు చెందిన ఒక కుటుంబం మాత్రం 40 ఏళ్ల కింద తప్పిపోయిన 93 ఏళ్ల తమ బామ్మను ఎంతో సంతోషంగా తమ ఇంటికి తీసుకొచ్చారు.

నాగ్ పూర్ కు చెందిన పంచూభాయ్ తన 53 ఏళ్ల వయసులో ఆస్పత్రికని వెళ్లింది. అక్కడ వారి కుటుంబంపై తేనేటీగలు దాడి చేశాయి. ఒక వ్యక్తి సాయంతో వాటి నుంచి తప్పించుకున్న పంచూభాయి.. తన కుటుంబసభ్యులను కలవకుండా తప్పిపోయింది. నూర్ ఖాన్ అనే వ్యక్తి దామోహ్ జిల్లాలోని తన గ్రామమైన కోట తాలాకు తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. అయితే పంచూభాయి మరాఠీలో మాట్లాడటంతో ఆ గ్రామప్రజలకు అర్థం కాలేదు. ఆ గ్రామ ప్రజలంతా ఆమెను మౌసీ (అత్త) అని పిలుస్తూ ప్రేమగా చూసుకునేవారు.

నూర్ ఖాన్ 2007లో చనిపోయాడు. అయినా సరే అతని కుటుంబసభ్యులు పంచూభాయిని వదలలేదు. ఆమెను కూడా తమ ఇంట్లో మనిషిలాగా చూసుకునేవారు. ఒకసారి పంచూభాయి నూర్ ఖాన్ కుమారుడు ఇస్రార్ తో కలిసి మాట్లాడుతూ.. ‘ఖంజ్నామా, పాత్రోట్’ అనే పదాలను వాడింది. ఇస్రార్ ఆ పదాలను గూగుల్ లో సెర్చ్ చేయగా పాత్రోట్.. మహారాష్ట్రలోని ఒక గ్రామం అని తెలిసింది. వెంటనే ఇస్రార్ ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో పంచూభాయి గురించి ఆరా తీశాడు. వెంటనే పంచూభాయి ఫొటోలను ఆ వ్యక్తి వాట్సాప్ చేశాడు. దాంతో పంచూభాయి కుటుంబం గురించి తెలుసుకోగలిగాడు.

విషయం తెలుసుకున్న పంచూభాయి మనవడు పృథ్వీ కుమార్ షింగిల్ వెంటనే కోట తాలాకు చేరుకున్నాడు. తమ అమ్మమ్మను నాగ్ పూర్ కు తీసుకువెళ్తానని ఇస్రార్ కు చెప్పాడు. దాంతో ఇస్రార్ కుటుంబమంతా దిగులు చెందారు. దాదాపు 40 ఏళ్ల తమతో కలిసి ఉన్న పంచూభాయి వెళ్లడానికి మొదట ఒప్పుకోలేదు. వీరే కాకుండా.. గ్రామస్తులు కూడా పంచూభాయిని పంపడానికి ఒప్పుకోలేదు. ఆమె కుటుంబసభ్యులు కూడా ఆమె గడపడానికి ఇష్టపడతారు కదా అని ఇస్రార్ అందరినీ ఒప్పించి పంచూభాయిని పృథ్వీకి అప్పగించాడు. పంచూభాయి వెళ్తుంటే గ్రామస్తులంతా కన్నీరు పెట్టుకున్నారు. గ్రామస్తులు పంచూభాయికి కొత్తబట్టలు పెట్టి.. బాధతో పంపించారు.

గ్రామస్తుల అభిమానాన్ని చూసిన పృథ్వీ.. ఆశ్చర్యానికి గురయ్యాడు. ‘నాగ్‌పూర్‌లో చికిత్స కోసం వెళ్లిన అమ్మమ్మ తప్పిపోయినప్పుడు నేను పుట్టలేదు. ఆమె దామోహ్ కు ఎలా చేరుకుంది అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మాకు మా అమ్మమ్మ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మమ్మను ఇంతకాలం చాలామంచిగా చూసుకున్నందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు’ అని పృథ్వీ అన్నాడు.

For More News..

కర్ణాటక ప్రభుత్వానికి రూ. 10 లక్షల ఫైన్

మీకు అది రాజనీతి అవుతుందా? బీజేపీ జాతీయాధ్యక్షుడికి హరీష్ రావు ప్రశ్న

వీడియో: 85 ఏళ్ల వయసులో బామ్మ యోగాసనాలు

Latest Updates