క‌రోనాపై పోరాటంలో… 95 మంది పోలీసులు, 46 మంది వైద్య సిబ్బంది మృతి

చైనాలో క‌రోనా మ‌హమ్మారిపై పోరాటంలో 95 మంది పోలీసులు, 46 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ అరిక‌ట్టే ప్ర‌య‌త్నంలో ముందు నిల‌బ‌డి పోరాడిన ఫ్రంట్ లైన‌ర్స్ మ‌ర‌ణాల గురించి ఆ దేశ అఫీషియ‌ల్ మీడియా సంస్థ గ్లోబ‌ల్ టైమ్స్ శ‌నివారం ప్ర‌చురించింది. క‌రోనా మ‌ర‌ణించిన వారికి సంతాపం తెలిపేందుకు శ‌నివారం చైనా నేష‌న‌ల్ మెమోరియ‌ల్ డే నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు, న‌ర్సులు, పోలీసుల మ‌ర‌ణాల‌కు సంబంధించిన రిపోర్టును చైనా అధికారిక మీడియా బ‌య‌ట‌పెట్టింది.

చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ రాజ‌ధాని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. 2019 చివ‌రిలో వుహాన్ లో తొలి క‌రోనా కేసు మొద‌లైంది. అది కొద్ది రోజుల్లోనే వేగంగా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వైర‌స్ వ్యాపించింది. ఆ దేశంలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 81,639 మందికి క‌రోనా సోక‌గా.. 3,326 మంది మ‌ర‌ణించారు. గురువారం నాటికి 60 మంది ఫ్రంట్ లైన్ పోలీస్ ఆఫీస‌ర్లు, 35 మంది ఆక్సిల‌రీ పోలీస్ ఆఫీస‌ర్లు క‌రోనాపై పోరాటంలో త‌మ ప్రాణాల‌ను కోల్పోయార‌ని చైనా ప‌బ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ చెప్పిన‌ట్లు తెలిపింది గ్లోబ‌ల్ టైమ్స్. అలాగే మార్చి 15 నాటికి 46 మంది డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌చురించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా శ‌నివారం నాటికి 11 ల‌క్ష‌ల 32 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అందులో 60 వేల మంది మ‌ర‌ణించ‌గా.. 2 ల‌క్ష‌ల 35 వేల మంది పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమెరికాలో 2 ల‌క్ష‌ల 77 వేల మందికి వైర‌స్ సోక‌గా.. 7 వేల మందికి పైగా మ‌ర‌ణించారు. స్పెయిన్ లో ల‌క్షా 24 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. 11,744 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇట‌లీలో ల‌క్ష 19 వేల మందికి వైర‌స్ సోకింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఈ దేశంలో 14 వేల మంది మ‌ర‌ణించారు.

Latest Updates